‘జనవరిలో బంగారం ధరల పెరుగుదల మొదలైంది. మార్చితో ముగిసిన 3 నెలల్లో 10 గ్రాముల ధర 8 శాతం పెరిగి రూ.45,434 (పన్నులు లేకుండా) పలికింది. గత ఏడాది జనవరి-మార్చిలో దాదాపు రూ.42,045గా ఉన్నది. పెరుగుదలకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఇందుకు కారణం. అయితే నిరుడు అక్టోబర్-డిసెంబర్లో రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత దేశీయంగా నగల డిమాండ్ ఈ ఏడాది జనవరి-మార్చిలో 26 శాతం తగ్గిపోయింది. 94 టన్నులకు పరిమితమైంది. 2010 నుంచి గమనిస్తే కరోనా ప్రభావిత సంవత్సరాలు మినహా మిగతా ఏండ్లలో తొలి త్రైమాసికంలో 100 టన్నులకు దిగువన నమోదు కావడం ఇది మూడోసారే’
-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో
ముంబై, ఏప్రిల్ 28: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే 18 శాతం పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది. తాజాగా విడుదల చేసిన ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2022’ నివేదికలో దేశీయంగా పుత్తడికి డిమాండ్ 135.5 టన్నులకు పరిమితమైందని ప్రకటించింది. భారీగా పెరిగిన ధరలే ఇందుకు కారణమని పేర్కొన్నది. కాగా, నిరుడు జనవరి-మార్చిలో పసిడికి ఆదరణ 165.8 టన్నులుగా ఉన్నట్టు చెప్పింది.
విలువపరంగా ఈసారి జనవరి-మార్చిలో గోల్డ్ డిమాండ్ 12 శాతం క్షీణించి రూ.61,550 కోట్లుగా ఉన్నది. నిరుడు ఇదే సమయంలో రూ.69,720 కోట్లుగా నమోదైంది. ఇక సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉండటం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కారణంగా 10 గ్రాముల ధర దేశీయ మార్కెట్లో రూ.50,000 తాకినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ క్రమంలోనే పండుగలున్నా, పెండ్లిండ్లున్నా అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగినట్టు చెప్పింది.
భారత్‌లో బంగారానికి డిమాండ్ తగ్గినా.. అంతర్జాతీయంగా మాత్రం ఈ జనవరి-మార్చిలో 34 శాతం పెరిగింది. 1,234 టన్నులుగా నమోదైనట్టు డబ్ల్యూజీసీ నివేదిక స్పష్టం చేసింది. నిరుడు 919.1 టన్నులుగా ఉన్నది. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా మదుపరులు తమ పెట్టుబడులను ఈక్వీటీ మార్కెట్ల నుంచి బంగారం వైపు మళ్లించారని పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఈటీఎఫ్‌లకు బలమైన మద్దతు కనిపించింది. అయితే బంగారు కడ్డీలు, నాణేలకు డిమాండ్ 20 శాతం పడిపోయి 282 టన్నులకే పరిమితమైంది.
నగల డిమాండ్ కూడా 7 శాతం దిగజారి 474 టన్నులుగా ఉన్నది. ఇక ఉద్రిక్తతల నడుమ మార్చిలో ఔన్సు ధర మునుపెన్నడూ లేనివిధంగా 2,070 డాలర్లు పలికిందని గుర్తుచేసింది. జనవరి-మార్చిలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 84 టన్నులకుపైగా కొన్నాయి. అయితే నిరుడు 117.5 టన్నులుగా ఉన్నాయి. ఈజీప్టు, టర్కీ దేశాల బ్యాంక్‌లు ఎక్కువగా కొన్నట్టు డబ్ల్యూజీసీ ఈ సందర్భంగా వివరించింది. రీసైక్లింగ్ గోల్డ్ 15 శాతం పెరిగి 310 టన్నులకు చేరింది.