న్యూఢిల్లీ, మే 20: బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,300 ఎగబాకి రూ.1.65 లక్షలకు చేరువైంది. అంతకుముందు ఇది రూ.1,63,600గా ఉన్నది.
యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ మరింత బలోపేతం అయినప్పటికీ గోల్డ్ ధరలు పుంజుకోవడం విశేషమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. కానీ, వెండి ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా రెండోరోజూ కిలో వెండి రూ.5 వేలు తగ్గి రూ.2.66 లక్షలకు దిగొచ్చింది. వరుసగా రెండు రోజుల్లో వెండి రూ.10 వేలు దిగొచ్చినట్టు అయింది. పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్నకు మొగ్గుచూపడంతో వెండి ధరలు దిగొస్తున్నాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,483.54 డాలర్లకు చేరుకోగా, వెండి 75.42 డాలర్లకు చేరుకున్నది.