హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి భారీ పెట్టుబడులు రప్పించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎంసీహెఆర్హెచ్ఆర్డీఈ బోధి పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ కే రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ కే శశాంక తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రభుత్వం ఒక సొసైటీని ఏర్పాటు చేయనుండగా.. ఆ ఏజెన్సీలో ఐటీ, పరిశ్రమల శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో పనిచేయనున్నట్టు తెలిపారు. కాగా ఎనర్జీ, ఫైనాన్స్ వంటి శాఖల అధికారులు ఇన్వెస్ట్ తెలంగాణలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండనున్నట్టు వివరించారు. ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయడంతో ఇతర రాష్ర్టాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను అవలంభించాలని సూచించారు. రాష్ర్టానికి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు సంపూర్ణంగా తోడ్పాటునందిస్తూ సహకరించే విధంగా ఇన్వెస్ట్ తెలంగాణ పని చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్ ఇంటర్నెట్ వినియోగంలోకి రావాలని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్ అవతల కూడా జీసీసీలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారుల వెంట జీసీసీలు, డాటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక పోత్సహకాలు ఇవ్వాలని సూచించారు.