Gold Rate | హైదరాబాద్, మార్చి 14: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్లో ఆల్‌టైమ్ హైని తాకుతూ తులం రేటు రూ.90,000కు చేరువైంది మరి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి విలువ శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా గరిష్ఠ స్థాయిలో రూ.89,780గా నమోదైంది. గురువారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజే రూ.1,200 పుంజుకోవడం గమనార్హం. నాడు రూ.88, 580గానే ఉన్నది. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) గోల్డ్ రేటు రూ.82,300గా ఉన్నది. అంతకుముందు రూ.81,200గా ఉండగా.. ఒక్కరోజే రూ.1,100 ఎగిసింది.
ఇదీ సంగతి..
పుత్తడి ధరలు ఒక్క భారతీయ మార్కెట్లోనేగాక, అంతర్జాతీయ మార్కెట్లోనూ దౌడు తీస్తున్నాయి. తొలిసారి ఔన్సు 3వేల డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడంతో.. మార్కెట్లో సమీకరణాలన్నీ వేగంగా మారిపోయాయి. ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. గ్లోబల్ ట్రేడ్ వార్‌కు దారితీస్తాయన్న భయాందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్ల నుంచి వారు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అలాగే ప్రత్యామ్నాయంగా కనిపించే బంగారం వైపు వాటిని మళ్లిస్తున్నారు. గోల్డ్ రేట్లు ఎగబాకడానికి ఇది కూడా ఓ బలమైన కారణమే. డిమాండ్ క్రమేణా పుంజుకుంటుండటంతో సహజంగానే ధరలు పెరుగుతూపోతున్నాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అంతేగాక మున్ముందు ధరలు ఇంకా పెరగవచ్చన్న అంచనాలనూ వెలిబుచ్చుతున్నారు. వచ్చే నెల భారత్‌సహా మరికొన్ని దేశాలపై అధిక సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్తున్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని, పెట్టుబడులు గోల్డ్ ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లోకి వెళ్లిపోతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా భారతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇంకా పెరిగిపోయేందుకు వీలున్నదని అంటున్నారు.
త్వరలో లక్ష మార్కుకు..
దేశీయ మార్కెట్లో ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే తులం బంగారం ధర లక్ష రూపాయలను దాటిపోవచ్చన్న అంచనాలు ప్రస్తుతం బలంగా వినిపిస్తుండటం విశేషం. దీపావళికి ఈ రికార్డును రేట్లు బ్రేక్ చేస్తాయన్న అభిప్రాయాలు అటు వ్యాపార వర్గాల నుంచి, ఇటు మార్కెట్ నిపుణుల నుంచి వస్తున్నాయి మరి. ఇంకొందరు దీపావళికి కాకపోతే ఈ ఏడాది ఆఖర్లో తప్పకుండా ధరలు రూ.లక్షను దాటేస్తాయన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. నిజానికి గత కొన్నేండ్లుగా పసిడి ధరలు పెరగడమే తప్ప, తగ్గిన దాఖలాలు లేవు. గణాంకాలను చూస్తే ఏటేటా అంతకంతకూ పెరుగుతూపోతున్నట్టే అర్థమవుతుంది. మొత్తానికి సంప్రదాయ కొనుగోలుదారులు, వ్యాపారులతోపాటు మదుపరులూ బంగారంపైనే ఆసక్తి కనబరుస్తుండటంతో అటు భౌతికంగా, ఇటు డిజిటల్‌గా గోల్డ్ రేట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇక ఫ్యూచర్ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తున్నది. చివరకు వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కిలో లక్షపైనే పలుకుతున్నాయి. సాధారణ కస్టమర్లతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ కనిపిస్తుండటమే ఇందుకు కారణమని చెప్తున్నారు.