న్యూఢిల్లీ, జూన్ 8: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరగడం, మరోవైపు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో పెట్టుబడిదారులు విలువైన లోహాలను విక్రయించడానికి మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.60 లక్షల దిగువకు పడిపోయింది.
బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.1,100 తగ్గి రూ.1,58,800గా నమోదైంది. గత శుక్రవారం ఇది రూ.1,59,900గా ఉన్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల గోల్డ్ రేటు వెయ్యికి పైగా తగ్గింది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2,55,700కి దిగొచ్చింది. ఈ నెల 2న వెండి ఏకంగా రూ.15,300 లేదా 6 శాతం తగ్గిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం తగ్గి 4,291.79 డాలర్లకు పడిపోగా, వెండి 1.35 శాతం దిగి 66.33 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండటం మదుపర్లలో ఆందోళనను పెంచింది.