శంషాబాద్ రూరల్, మార్చి 26: వెండి తీగలరూపంలో బంగారాన్ని అక్రమంగా రవాణాచేస్తున్న వ్యక్తిని శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడి బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో వెండి తీగలరూపంలో 255.6 గ్రాముల బంగారం లభించింది. బంగారం విలువ రూ.13.63 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.