e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News నారసింహుడికి స్వర్ణ కానుకలు

నారసింహుడికి స్వర్ణ కానుకలు

  • గోపుర తాపడానికి యథాశక్తి నివేదన
  • విరాళాలిచ్చేవారికి ప్రధానార్చకుల సూచనలు
  • ఆలయ ఖాతాలో జమచేయవచ్చన్న ఈవో
  • సీఎం పిలుపుతో కదులుతున్న సమాజం
  • ఆరు కిలోల బంగారం ప్రకటించిన మేఘా
  • ప్రణీత్‌గ్రూప్‌ నరేంద్రకుమార్‌ 2 కిలోలు
  • కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నరసింహారెడ్డి 2 కిలోలు
  • చెన్నూరు ప్రజల పక్షాన బాల్కసుమన్‌ కిలో
  • జలవిహార్‌ రామరాజు కిలో బంగారం వితరణ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: పంచనారసింహుడి దివ్యక్షేత్రం యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం చేయడంలో తెలంగాణ సమాజం, సమస్త భక్తకోటి భాగస్వామ్యం ఉండాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు సామాన్యుల నుంచి సంపన్నుల దాకా పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. డబ్బు కంటే.. తెలంగాణ సమాజం భాగస్వామ్యమే ముఖ్యమని సీఎం తెలిపారు. ఈ క్రమంలో ధన, కనకాదులను సమర్పించదలచుకొన్నవారు ఏ విధంగా స్వామివారికి ఇవ్వాలో తెలియజేయాలని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానార్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులవారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఆచార్యులు నారసింహనిధికి విరాళాలు అందించే భక్తులకు సందేశాన్ని అందించారు. విరాళాలు ఇచ్చేవారు ముందుగా తమ ఇంట్లో లక్ష్మీనారసింహుడి ప్రతిమ, లేదా చిత్రపటం ముందు తాము చెల్లించదలచిన సొమ్మును లేదా చెక్కును స్వామివారి పాదాల చెంత ఉంచి.. ధ్యానించాలని పేర్కొన్నారు.

నారసింహుడికి సమర్పించే బంగారం విలువ మొత్తాన్ని అందించే ముందు భక్తులు ఈ శ్లోకం పఠించాలని ప్రధానార్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహా చార్యులు సూచించారు.

- Advertisement -

ధ్యాయే నృసింహం.. తరుణార్క నేత్రం.. సితాంబుజాతం జ్వలితాగ్ని వక్రం
అనాది మధ్యాంతమజం పురాణం.. పరాత్పరేశం జగతాం నిధానం..
అని ధ్యానించి.. అనంతరం
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః.. ఋచఃసామాని జజ్ఞిరే
ఛన్దాగ్‌ంసి జజ్ఞిరే తస్మాత్‌.. యజుస్తస్మాదజాయత
భూషణాని విచిత్రాణి హేమరత్నమయానిచ..
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద
ఓం శ్రీలక్ష్మీనృసింహాయ నమః సువర్ణ దక్షిణాం సమర్పయామి
అని త్రికరణ శుద్ధిగా ‘మా శక్తిమేరకు ముడుపులు చెల్లిస్తున్నాను స్వామి’ అని అనుకొని భక్తిభావనతో తాము చెల్లించదలచిన సొమ్మును లేదా చెక్కును స్వీకర్తలకు నేరుగా కానీ, ఆలయ ఖాతాలో కానీ జమచేయవచ్చు

అంతా భాగస్వాములు కండి

  • యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌ గీత

దివ్యవిమాన గోపురానికి బంగారుతాపడం చేయించడంకోసం విరాళాలకు ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని భక్తులు సద్వినియోగపరచుకోవాలని ఈవో ఎన్‌ గీత సూచించారు. ఈ మహాకార్యంలో భాగస్వాములు కావాలనుకొన్నవారు దేవస్థానం ఖాతాలో నగదును జమచేయవచ్చని బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఖాతా నంబర్‌ 6814884695, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఐడీఐబీ000వై011, ఇండియన్‌బ్యాంక్‌ యాదగిరిగుట్ట బ్రాంచ్‌లో తమకు తోచిన నగదును జమచేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.

ప్రణీత్‌ గ్రూప్‌ 2 కిలోలు

ప్రణీత్‌ గ్రూప్‌ 2 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ పుణ్య కార్యంలో తమను భాగస్వాములను చేయడానికి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రణీత్‌ గ్రూప్‌ సంస్థ ఎండీ నరేంద్రకుమార్‌ కామరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. 2 కిలోల బంగారం కానీ ఇందుకు సమానమైన చెక్కును కానీ త్వరలో అందజేస్తామని తెలిపారు.

జలవిహార్‌ పక్షాన కిలో బంగారం

విమాన గోపురానికి బంగారు తాపడం కోసం జలవిహార్‌ పక్షాన ఒక కిలో బంగారాన్ని అందజేస్తామని ప్రముఖ వ్యాపారవేత్త ఎన్‌వీ రామరాజు ప్రకటించారు. ‘యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ మహతార్యంలో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. మన భారతదేశం ఎంతోమంది గొప్ప చక్రవర్తులకు ప్రసిద్ధి పొందింది. చెట్లు నాటడంలో అశోకుడు, నీటిపారుదల వ్యవస్థ నిర్మాణంలో రాణిరుద్రమదేవి, దేవాలయాల నిర్మాణానికి రాజరాజ చోళుడు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు శ్రీకృష్ణ దేవరాయలు ఎంతో గొప్ప కృషిచేసి, చరిత్ర గతిలో ప్రసిద్ధి పొందారు. ఆ గొప్ప చక్రవర్తులు సాధించిన కార్యాలన్నీ మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దశాబ్దకాలంలోనే సాకారం చేయగలిగారు. దైవికమైన ఈ ప్రయత్నాల్లో సామాన్య ప్రజలను సైతం భాగస్వాములను చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని రామరాజు చెప్పారు.

వెల్లువెత్తుతున్న విరాళాలు

విమాన గోపురం బంగారం తాపడానికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన రెండోరోజున 11 కిలోల బంగారం విరాళంగా వచ్చింది. సీఎం కేసీఆర్‌ విమాన గోపురం బంగారం తాపడానికి విరాళాలు ఇవ్వాలని పిలుపు ఇచ్చిన కొద్ది సేపటిలోనే మొదటిరోజు 22.16 కిలోల బంగారం విరాళంగా వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) 6 కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా మేఘా డైరెక్టర్‌ బీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్యకార్యక్రమమని, ఇందులో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. త్వరలోనే ఆరు కేజీల బంగారం కానీ, ఇందుకు సమానమైన మొత్తాన్ని చెకు రూపంలో కానీ అందజేస్తామని వెల్లడించారు.

చెన్నూరు ప్రజల పక్షాన కిలో గోల్డ్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమానగోపురం తాపడానికి చెన్నూరు నియోజకవర్గం ప్రజల పక్షాన కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నామని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల సుమన్‌ ప్రకటించారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మీడియాకు వివరాలు చెప్పారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో ఆధ్యాత్మికత, భక్తిశ్రద్ధలు ఎక్కువని, అవి కలిగిన ప్రజలు విరాళాలు ఇచ్చిన డబ్బులతో కిలో బంగారం కొని ఆలయానికి పంపిస్తామని చెప్పారు. ఈ బృహత్కార్యంలో ప్రతి కుటుంబం పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కేఎన్‌ఆర్‌ 2 కిలోలు

ప్రభుత్వం తలపెట్టిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణం అద్భుతమని కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ కామిడి నరసింహారెడ్డి అన్నారు. ప్రజలను భాగస్వాములను చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం అద్భుతమని చెప్పారు. బంగారు తాపడంలో తమ వంతు భాగస్వామ్యం కోసం 2 కిలోల బంగారాన్ని ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే బంగారాన్ని కానీ అందుకు సమానమైన చెక్కును కానీ అందజేస్తామని పేర్కొన్నారు.

విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్‌
6814884695
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌
ఐడీఐబీ000వై011,
ఇండియన్‌బ్యాంకు
యాదగిరిగుట్ట బ్రాంచ్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement