Dharmaram | ధర్మారం, ఏప్రిల్ 5 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలు మళ్లీ పునః ప్రారంభమయ్యాయి. వరద కాల్వకు అనుబంధంగా యాసంగిలో సాగుచేసిన వరి పొలాలకు సాగునీటిని అందించడానికి ఇటీవల మూడు రోజులపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో మళ్లీ అదే వరద కాలువకు నీటిని తరలించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఆదివారం నుంచి స్థానిక ఇంజనీరింగ్ అధికారులు గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియను ప్రారంభించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను తరలించేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ లోని ఉదయం 9 గంటలకు 2,7 నెంబర్ల మోటార్లను నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. సాయంత్రం నాలుగు గంటల వరదాకా మోటార్లు నడిపిన అనంతరం నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీటిని నంది పంప్ హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ ల ద్వారా నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు.
అనంతరం నంది రిజర్వాయర్ లోని మెయిన్ గేట్లు ఎత్తడంతో అదే పరిమాణంలో జలాలు జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంపు హౌస్ కు తరలిపోతున్నాయి. అక్కడ రెండు బాహుబలి మోటార్లను ఆన్ చేయడంతో నీటిని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వరద కాల్వకు తరలిస్తుండగా ఎదురెక్కి పైకి వెళ్తున్నాయి. కాగా ఈసారి వారం రోజులపాటు నీటి ఎత్తిపోతలు ఉంటాయని ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.