‘గోదారి గట్టుపైన’ సినిమా కథ మనందరి జీవితాల్లో చూసినట్లుగానే ఉంటుందని, ప్రతి ఒక్కరూ పాత్రలతో కనెక్ట్ అవుతారని చెప్పారు దర్శకుడు సుభాష్‌చంద్ర. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటించారు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం సుభాష్‌చంద్ర విలేకరులతో మాట్లాడారు. ‘నా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రేలంగి. బిటేక్ రోజుల నుంచే షార్ట్‌ఫిల్మ్స్ తీయడం అలవాటు.
ఇప్పటికీ 80 షార్ట్‌ఫిల్మ్స్ చేశా’ అన్నారు. గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇదని, హీరో సుమంత్ప్రభాస్ గోదావరి యాసను పర్ఫెక్ట్గా పలికారని, అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలిపారు. ‘ప్రతీ తండ్రికి తన కూతురిని తనకంటే గొప్పవ్యక్తికి ఇవ్వాలని ఉంటుంది. ఇది ఆయన ప్రేమలోని నిజం. అలాగే అబ్బాయి ప్రేమలో కూడా నిజం ఉంటుంది.
ఈ సంఘర్షణల మధ్య సాగే ప్రేమప్రయాణమిది. ఈ కథను చాలా పరిణతితో చెప్పే ప్రయత్నం చేశా. జగపతిబాబు, లైలా పాత్రలు సినిమాకు వెన్నెముక’ అని సుభాష్‌చంద్ర అన్నారు. దర్శకత్వంలో తనకు స్టీవెన్ స్పీల్బర్గ్ స్ఫూరి అని, ‘జురాసిక్ పార్క్’ చూసినప్పటి నుంచే సినిమాలపై ఆసక్తిపెరిగిందన్నారు.