హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కాగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ‘ప్రాంతీయ’ చిచ్చు రగులుతున్నది. ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ నేతల ఆధిపత్యం పెరిగిపోతున్నదని, రోజురోజుకూ తమ ప్రాభవం తగ్గుతున్నదని ఉత్తర తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా డిప్యూటీ సీఎం, ఇతర కీలక మంత్రులంతా దక్షిణ తెలంగాణకు చెందినవారేనని చర్చించుకుంటున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మంత్రివర్గంలో ‘నంబర్ 1 నుంచి నంబర్ 6’ వరకు ఉన్న నేతలంతా దక్షిణ తెలంగాణ జిల్లాలవారేననే అసంతృప్తి వ్యక్తమవుతున్నదని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఖమ్మం నుంచి మల్లు భట్టి విక్రమార,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వద్ద కీలక శాఖలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కీలకమైన శాఖలు ఉన్నాయని చెప్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా వారి ఆధిపత్యమే కొనసాగుతున్నదనే చర్చ జరుగుతున్నది. ఉత్తర తెలంగాణ మంత్రులకు ప్రాధాన్యం లేని శాఖలు అప్పగించారన్న ప్రచారం జరుగుతున్నది. తమ ప్రాంత నేతలకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారట.
భవిష్యత్తులో జరుగబోయే మంత్రివర్గ విస్తరణకు కూడా మళ్లీ దక్షిణ తెలంగాణ నేతలే పోటీ పడుతున్నారని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఉమ్మడి నల్లగొండ నుంచి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారనే చర్చ నడుస్తున్నది. ఉత్తర తెలంగాణ నుంచి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న నేతలకు సలహాదారు పదవులతోనే చల్లబరుస్తున్నారని చెప్తున్నారు. మాజీ మంత్రి షబ్బీర్అలీకి మైనారిటీ కోటా కింద క్యాబినెట్లో చోటు వస్తుందని భావించగా, సలహాదారుతో సరిపెట్టారని అంటున్నారు. సుదర్శన్‌రెడ్డికి క్యాబినెట్లో చోటు లభిస్తుందని ప్రచారం జరిగినా, సలహాదారు పదవినే కట్టబెట్టారని గుర్తుచేస్తున్నారు.