ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలు, స్వరాష్ట్రంలో కొత్త రూపు దిద్దుకున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి అల్లోల ఆధ్వర్యంలో పురాతన కొవెలలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేయగా, ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా మారాయి. ఆయా చోట్ల ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో, భక్తులకు సదుపాయాలు సమకూరుతున్నాయి.
నిర్మల్, మార్చి 20(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలు నిర్లక్ష్యానికి గురికాగా.. స్వరాష్ట్రంలో కొత్త రూపు సంతరించుకున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురాతన ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోగా.. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆలయాల పురోగతి అగ్రస్థానానికి చేరింది. 2014 ముందు ఒక్కో గుడికి దూపదీప నైవేద్యం కింద రూ. 2500 ఉండగా.. 2014 సంవత్సరం తర్వాత రూ.6 వేలకు పెంచారు. 155 ఆలయాలు మాత్రమే ధూపదీప నైవేద్యం కింద ఉండగా, ఆ సంఖ్య 329కి చేరింది. కామన్ గుడ్‌ఫండ్ (సీజీఎఫ్) కింద గతంలో 101 ఆలయాల అభివృద్ధికి కేవలం రూ.22.32 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం 712 దేవాలయాల పునరుద్ధరణకు రూ.105.24 కోట్లు కేటాయించింది.
ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడమే కాకుండా, మానసిక ప్రశాంతత, నైతిక విలువల పెంపుదల కోసం ఆలయాలు ఎంతో తోడ్పడు తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని అనేక ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ కారణంగానే ఆలయాలకు పూర్వవైభవం చేకూరుతున్నది.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి