మోటకొండూర్, అక్టోబర్ 13 : బాలికల కోసం ప్రభుత్వం రూపొందించిన పాలసీలు, చట్టాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బాల రక్ష భవన్ యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆర్డినేటర్ అనంతలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ.. బాలికల విద్య, వైద్యం, ఆరోగ్యం, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదన్నారు. బాలల హక్కులు, రక్షణ చట్టాలపై బాల్యం నుండే అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు యాక్షన్ ఎయిడ్ సంస్థ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.
బాలికలు జువైనల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ చట్టం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. లింగ సమానత్వం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నంబర్లను బాలికలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ కమ్యూనిటీ ట్రైనర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం, పాఠశాల ప్రిన్సిపాల్ తెగుళ్ల జ్యోతి, బాలరక్ష భవన్ ప్రతినిధులు దశరథ, ప్రతిభ, యాక్షన్ ఎయిడ్ ఎల్ఆర్పీలు కవిత, చంద్రకళ, శోభారాణి, మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.