Death : మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఘోరం జరిగింది. చిరుతపులి (Leopard) దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసులు, అటవీ అధికారులు గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి కచ్చితమైన కారణం తెలిసే అవకాశం ఉందని అటవీ అధికారులు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లా అష్తి తాలూకాలోని బావి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రైతు పశువులను మేపేందుకు తన పొలంవైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న చిరుతపులి అతడిపై దాడిచేసి లాక్కెళ్లింది. పశువులు ఇంటికి చేరినా రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇరుగుపొరుగుకు విషయం చెప్పారు.
దాంతో చిరుతపులి ఎత్తుకెళ్లి ఉంటుందని అనుమానించిన గ్రామస్తులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. పోస్టుమార్టం నివేదికలో చిరుత దాడిచేసిందా, మరేదైనా జరిగిందా అనేది కచ్చితంగా తెలిసే అవకాశం ఉందని అన్నారు.