జెరుసలాం: ఇజ్రాయిల్ పార్లమెంట్ కెనెసెట్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రసంగిస్తున్న సమయంలో కొందరు సభ్యులు అడ్డుకున్నారు. ట్రంప్ ప్రసంగం ప్రారంభించిన అయిదు నిమిషాల్లోనే హమాస్‌కు మద్దతు పలుకుతూ ఇద్దరు సభ్యులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆ ఇద్దరు కెనెసెట్ సభ్యులను బయటకు లాక్కెళ్లారు. ఆ సమయంలో కాసేపు ట్రంప్ తన ప్రసంగాన్ని ఆపారు. చాలా సమర్థవంతంగా భద్రతా సిబ్బంది వ్యవహరించినట్లు ఆ ఘటన తర్వాత ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఇది చరిత్రాత్మకమైన కొత్త ఆరంభం అన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. నెతన్యహూ ధైర్యం అసామాన్యమైందన్నారు. చర్చలకు సహకరించిన అరబ్ దేశాలకు కూడా ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు. ఇదొక అద్భుత విజయం అన్నారు. ఇక ఇజ్రాయిల్‌లో స్వర్ణయుగం మొదలైందని, యావత్ ప్రాంతానికే ఇది స్వర్ణ యుగమన్నారు.
🚨BREAKING: Two Pro-Hamas agitators INTERUPTED President Trump’s speech in the Israeli Knesset, and they were QUICKLY dealt with
TRUMP: “That was very efficient.” pic.twitter.com/9rZPtshGNQ
— The Patriot Oasis™ (@ThePatriotOasis) October 13, 2025
ఇజ్రాయిల్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు ట్రంప్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పాలస్తీనాను గుర్తించండి అంటూ ఆయన ఓ ప్లకార్డు పట్టుకున్నారు. సభను ఆర్డర్లో పెట్టాలని ఆ సమయంలో స్పీకర్ ఆమిర్ ఓహనా గట్టిగా అరిచారు. నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష ఎంకే సభ్యుడిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రెండేళ్ల పాటు హమాస్ చెరలో ఉన్న 20 మంది బంధీలు ఇవాళ ఇజ్రాయిల్ చేరుకున్నారు.
ఆయుధాల వల్లే శాంతి వెలిసినట్లు ట్రంప్ చెప్పారు. ఆయుధాలు కావాలంటూ ఇజ్రాయిల్ తనను పలుమార్లు కోరిందని, దీంతో ఇజ్రాయిల్ శక్తివంతంగా తయారైందన్నారు. దీని వల్ల శాంతి ఏర్పడినట్లు ట్రంప్ చెప్పారు. శాంతి ఒప్పందం కోసం పనిచేసినవారిలో ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అడ్వైజర్ జేర్డ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, సెక్రటరీ పీట్ హెగ్సేత్ కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు.
కెనెసెట్‌లో ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అబ్రహం, ఇసాక్, జాకబ్ దేవతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఆకాశం నిర్మలంగా మారిందని, తుపాకులు మూగబోయాయని, సైరన్లు మోగుతున్నాయని, పవిత్ర భూమిలో శాంతి సూర్యుడు ఉదయించాడని ట్రంప్ అన్నారు. ఇక ఎప్పటికీ ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది యుద్ధానికి ముగింపు మాత్రమే కాదు… టెర్రర్, మరణాలకు కూడా ఇది ముగింపు యుగమన్నారు. విశ్వాసం, దేవుడిపై నమ్మకం పెరిగే యుగం ఇది అన్నారు. మిడిల్ ఈస్ట్‌లో కొత్త చరిత్ర లిఖితమైందన్నారు.