జూబ్లీహిల్స్, నవంబర్17: యూసుఫ్‌గూడ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోనే తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను చేపట్టేందుకు ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు కార్మికనగర్‌లో అదనపు సెకెండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ (ఎస్‌సీటీపీ) యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. స్వచ్ఛ ఆటోలతో ప్రతిరోజు ఇండ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను యూసుఫ్‌గూడలోని డంపింగ్ యార్డుకు తరలించి, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రాసెసింగ్, రీ సైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంటారు. ఈ ప్రకియను పకడ్బందీగా నిర్వహించేందుకు యూసుఫ్‌గూడ సర్కిల్లో అదనపు ఎస్‌సీటీపీ ఏర్పాటు చేయనున్నారు.
స్వచ్ఛ సర్కిల్‌గా మార్చేందుకు..
స్వచ్ఛ సర్కిల్‌గా మార్చేందుకు చేపట్టిన కృషిలో భాగంగా బల్దియా అధికారులు పలుచోట్ల డంపర్ బిన్లు తొలగించారు. దీంతో కార్మికనగర్ నుంచి శ్రీరాంనగర్ వెళ్లే రోడ్డు చెత్తకు నిలయంగా మారుతున్నది. ఈ ప్రాంతంలో చెత్తకు చెక్ పెట్టేందుకు ఎస్‌సీటీపీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. స్వచ్ఛ ఆటోల్లో తడి, పొడి చెత్త కలిసి పోతుండడంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో ప్రాసెసింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే పకడ్బందీగా చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్కిల్ పరిధిలోనే ఈ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్‌లోని కంప్రెషర్ బిన్లలో డంప్ చేసిన చెత్తను ఆధునిక యంత్రాలతో ప్రెస్ చేయడంతో అందులోని వ్యర్థాలు, కలుషిత నీరు తొలగిపోతుంది. ఆటోలో తరలించిన చెత్త మొత్తం గట్టిగా మారిపోతుంది. రవాణాకూ అనుకూలంగా ఉండే ఈ చెత్తను ప్రాసెసింగ్, రీ సైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఏ.రమేశ్ ఆధ్వర్యంలో ఏఎంవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్‌సీటీపీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్సీటీపీతో పారిశుధ్య సమస్యకు చెక్
యూసుఫ్‌గూడలో చెత్త సమస్యకు పరిష్కారం చూపేందుకు అదనపు కలెక్షన్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నాం. సర్కిల్ వ్యాప్తంగా సేకరిస్తున్న చెత్తను యూసుఫ్‌గూడ ట్రాన్స్ఫర్ పాయింట్‌కు తరలించేందుకు స్వచ్ఛ ఆటోలకు కాలయాపన జరుగుతున్నది. దీంతో స్థానికంగా సేకరిస్తున్న చెత్త వేయడానికి అదనపు ఎస్సీటీపీని ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో సేకరించిన చెత్తను నేరుగా అక్కడే డంప్ చేస్తారు. తద్వారా పూర్తిస్థాయిలో పారిశుధ్య సమస్య పరిష్కారానికి సాధ్యమవుతుంది.