హనుమకొండ చౌరస్తా, జూన్ 8: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జీవో 74 ప్రకారం పారా క్రీడాకారులకు కల్పించాల్సిన 2 శాతం రిజర్వేషన్లు ఇప్పటివరకు సమర్ధవంతంగా అమలు కాలేదు, దీని కారణంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ప్రతిభ కనబరిచిన అనేక మంది దివ్యాంగ క్రీడాకారులు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక రంగాలలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గాడిపల్లి ప్రశాంత్ అన్నారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
2023లో హైకోర్టు జీవో 74 ప్రకారం స్పోర్ట్స్ కోటాలో పారా స్పోర్ట్స్ ను కూడా చేర్చి 2 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. అలాగే, 2025 నూతన క్రీడా విధానం అమలులోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ, పారా క్రీడాకారుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం పారా క్రీడాకారుల ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన ఏఈఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో మా దివ్యాంగ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ నోటిఫికేషన్లను నిలిపివేయాలన్నారు.
అదేవిధంగా పారిస్ పారాలింపిక్స్‌లో టి-20 విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించిన అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తికి ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి ప్రకటించిన గ్రూప్-2 ఉద్యోగ నియామకం, 500 గజాల ఇంటి స్థలము రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాకపోవడం బాధాకరమన్నారు. జీవో 74 అమలు కాకపోవడం వల్ల టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియలో కూడా పారా క్రీడాకారులు నష్టపోయారని, ఈ నేపథ్యంలో గ్రూప్-1 కేటగిరిలో పారా స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద నిలిపివేయబడిన ఒక పోస్టును దివ్యాంగ క్రీడాకారులకు కేటాయించి న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ క్రీడాకారుడు గౌతమ్ యాదవ్, క్రీడాకారులు దూడల శ్రీనివాస్,వక్కల రాజు,భాను ప్రసాద్,నితీష్, ప్రవీణ్, అబ్దుల్, శివ,రమాదేవి