Congress | సవాళ్లకు ప్రతి సవాలుగా ‘సత్నారి, ఇత్తారి’ అనే ఇద్దరు వ్యక్తులు కేఎస్ఆర్టీసీ బస్సులో కర్ణాటకకు వెళ్తున్నారు. సాయంత్రం ఐదున్నర గొడ్తున్నది. ఆ బస్సులో వీరిద్దరే మగ మహారాజులు. తతిమా ప్రయాణికులంతా మహిళామణులే. బస్సు ఇరుకుగా ఉంది. ఇరుకుగా ఉన్నా రోడ్లు సాఫ్‌గా ఉండటం వల్ల వాళ్ల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. అందులో 42 సీట్లయితే, సుమారు నూరు మందికిపైగా జనాలున్నరు. 99 శాతం కర్ణాటకకు చెందిన ప్రయాణికులే. వాళ్లెవ్వలో గాదు, అక్కడ ఉపాధి కరువై తెలంగాణకు వలస వస్తున్న కర్ణాటక కూలీలు. రోజువారీగా పని పూర్తవ్వగానే ఇలా రోజూ కర్ణాటకలోని తమ శివారు గ్రామాలకు వెళ్తుంటారట.
టికెట్ తీసుకుందామని కండక్టర్ కోసం సూత్తున్నడు సత్నారి. ఎంతసేపు ఎన్కులాడినా ఎవ్వల్ రాకపోయేసరికి ‘టికెట్లిచ్చేటోళ్లు ఎవ్వల్ లేరా?’ అని గట్టిగా అరిచిండు సత్నారి. నిద్రపోతున్న కండక్టర్ నిద్రలేసి సత్నారి దగ్గరికి వచ్చి ‘ఎక్కడికి వెళ్లాలి సార్..’ అనడిగింది. ‘ఈ బస్సు ఎక్కడివరకు వెళ్తుంది’, ‘మీరు ఎక్కడికి వెళ్లాలి సార్’, ‘ఈ బస్సు ఎక్కడివరకు వెళ్తే అక్కడివరకు.. మాది గమ్యం లేని ప్రయాణం’ అని చెప్పడంతో తల కొట్టుకొని మరీ రెండు టికెట్లు సత్నారి చేతిలో పెట్టింది. టికెట్టు తీసుకున్న ‘సత్నారి, ఇత్తారి’తో ముచ్చట్లు షురూజేసిండు. వీళ్లు ఇంతకూ ఎక్కడ కూర్చున్నారో తెలుసా? డ్రైవర్ పక్క ఉండే ఇంజిన్పైన.
‘అరేయ్ ఇత్తారి కాంగ్రెస్ నేతలు తెగ కోతలు కోస్తున్నార్రా..’
‘అవ్ ఔనురో.. కోతలు కోసుట్లా వాళ్లను ముంచినోళ్లు సారీ మించినోళ్లు లేరురా సత్నారి’
‘అయినా కాంగ్రెస్ నాయకులు చేసే పనేం ఉండది కాబట్టి కోసేది కోతలే కదరా ఇత్తారి? ’
‘అరేయ్ వాళ్లు చేసేది పనే కదరా? పనేం ఉండదంటున్నావ్? ఇంతకీ నువ్వు మాట్లాడుతున్న ఏ కోతల గురించిరా సత్నారి’
‘అరేయ్ ఇత్తారి నిన్న రాహుల్‌గాంధీ వరి కోతలు కోసిండు గదరా వాటి గురించే’..
‘ఓర్నీ నేనన్నది.. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డిలతో పాటు చోటా బడా నేతలు నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతున్నరు కదా నేను ఆ కోతల గురించి అడుగుతున్నాన్రా…?
‘వాళ్లు కర్ణాటక అభివృద్ధి చూపిస్తాం వస్తారా’ సవాళ్లు విసిరితే చూసొద్దాం పదా అని పోదామనుకున్నా.. పోతూపోతూ నిన్నూ తీసుకువెళ్తున్నా… విషయం చెప్తే మజ్జలోనే దడ్సుకుంటవని చెప్పకుండ తీసుకవోతున్నా..’
‘అబ్బరకొండే సంపినవ్ గదరా?’
ఒక్కసారి నిద్రవోతున్న మహిళామణులంతా లేసి కూసున్నరు. వీళ్ల లొల్లికే లేసిర్రేమోనని ఇత్తారి గజ్జుమని అనుకుతడు. కానీ, బస్సు తెలంగాణ దాటి కర్ణాటకకు చేరిందని సత్నారికి తెలుసు. అప్పటిదాన్క సౌండ్ లేకుండా సాఫీగా సాగిన బస్సు ప్రయాణం.. ఎక్కడ టైర్లు కూలిపోతదో అనే రేంజ్లో ఊగిపోతున్నది బస్సు. అందులో ఉన్న మహిళామణులు కర్ణాటక గవర్నమెంటుపై ఊగిపోతున్నరు.
వాళ్ల మాటలిన్న.. సత్నారి ‘అరేయ్.. కన్నతల్లికి సున్నం పెట్టనోడట పిన్నతల్లికి అన్నం పెడుతడంటా’ అని ఓ సామెత విసిరేశాడు.
‘అందుకేరా ఇత్తారి నేనన్నది.. కోతలు కోసుట్ల కాంగ్రెస్ నేతలను మించినోళ్లు లేరురా..’
‘గతుకుల రోడ్డే కాదురా సత్నారి, కిటికీలోంచి చూస్తే శిమ్మశీకట్లే కనవడ్తున్నయి. వీళ్లారా మనకు నీతులు చెప్పేది?’
‘ఏ డ్రైవర్ సాబ్ బస్సు ఆపుకో.. మేం యూ టర్న్ తీసుకుంటం..’ అని శెప్పంగనే డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. దెబ్బకు బస్సుకున్న డోర్ ఊశి ఔతలవడ్డది.
– గడ్డం సతీష్