గీసుగొండ, డిసెంబర్ 3 : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ గ్రామాలకు అభివృద్ధి నిధులు ఇస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో గీసుగొండ, సంగెం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, నామినేషన్లు వేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 109 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తన వద్దకు తీసుకురావాలని పార్టీ ముఖ్య నాయకులకు సూచించారు. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల నాయకులు కోరుతున్నారు.
దండేపల్లి, డిసెంబర్3 : ‘కోతుల బెడద నుంచి కాపాడేందుకు కొండముచ్చును తీసుకొచ్చిన. ఇక మీకెలాంటి బాధ లేదు. మీ ఓట్లు మాత్రం నాకే వేయాలి’ అంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వర్ వినూత్న ప్రచారానికి తెరలేపాడు. కోతుల బెడద తట్టుకోలేకపోతున్నామని, ఈ సమస్య పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టంచేయడంతో సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వర్ కోతుల బెడదను తీర్చడానికి ప్రత్యేక వాహనంలో కొండెంగను తీసుకొచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.