రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి సాయంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. రెండు హాస్టళ్ల ప్రారంభానికి ఆహ్వానించడంతో సీఎం అదే నెలలో వారికి సమయం ఇచ్చారు. కేసీఆర్ హయాంలోనే మంజూరై నిర్మాణం మొదలైన హాస్టళ్లను ముఖ్యమంత్రి ఆరంభించి, ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగించడం ఆనాటి కార్యక్రమాలు. విద్యార్థులు, పాలకుల కలయిక అంటే భద్రతా సిబ్బందికి కత్తి మీద సామే. సీఎం కార్యక్రమంలో ఎలాంటి నిరసనలు ఉండకూడదని ముందురోజు రాత్రే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను గృహ నిర్బంధం చేశారు. విద్యార్థులు సమూహాలుగా రాకుండా ఇనుప కంచెలు మొలిచాయి. ఉత్సాహంగా సీఎం యూనివర్సిటీ అభివృద్ధి పనులకు రూ.వెయ్యి కోట్లు హామీ ఇస్తూ డిసెంబర్లో మరో సమావేశం పెట్టుకుందామన్నారు.
సీఎం అన్నట్లుగానే వర్సిటీ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్ల మంజూరు ఉత్తర్వు వచ్చేసింది. అదే ఏడాది డిసెంబర్ 10వ తేదీన ఆర్ట్స్ కాలేజీ ముందు అశేష విద్యార్థుల సమక్షంలో ఆ జీవో కాపీని రేవంత్‌రెడ్డి అధికారులకు అందజేశారు. 109 ఏండ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ప్రభుత్వమూ ఒక్కసారిగా ఇంత సొమ్మును ప్రకటించలేదు. అధికారులు, అధ్యాపకులు, విద్యార్థుల కండ్లల్లో కొత్త భవనాలు, ఆధునిక వసతుల ఊహలు వెలిగిపోయాయి. అధికారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తూ ‘కొత్త భవనాలు ఉంటే సరిపోదు. వెయ్యికి పైగా ఉన్న బోధనా సిబ్బంది ఖాళీలను కూడా పూరిస్తేనే తగిన ప్రయోజనం ఉంటుంది’ అని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
అదేరోజు విద్యార్థులు సూచనలు, ఆలోచనలను తమతో పంచుకోవాలని ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా సీఎం విడుదల చేశారు. కానీ ఆ కోడ్‌ను ఎప్పుడు స్కాన్ చేసినా ఏ సర్వర్‌కు దీనిని అనుసంధానించలేదని మెసేజ్ వస్తున్నది. అది అలా ఉండగా ఇంతవరకు సీఎం అందించిన జీవో 189 ప్రకారం రూ.వెయ్యి కోట్లలో ఒక్క విడత కూడా నిధులు యూనివర్సిటీ అధికారులకు చేరిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ ఏడాది మే 26న వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో విద్య కోసం 8.2 % నిధులను కేటాయించింది. ఇదే సంవత్సరంలో కర్ణాటక, 12%, ఏపీ 14% బడ్జెట్ విద్యకు అందిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యాభివృద్ధి కోసం కనీసం 15% నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ 18% నిధులను విద్యకు వెచ్చించాలని సూచించింది.
2026-27 బడ్జెట్ కేటాయింపు ప్రకారం రూ.26,587 కోట్లు విద్యా విభాగానికి వస్తే అందులో రూ.21 వేల కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్‌కే అవసరం. అయితే ఈ కేటాయింపు ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణ, అభివృద్ధికి చెందుతుంది. నిర్వహణలో సిబ్బంది జీతభత్యాలు, అభివృద్ధి అంటే కొత్త నిర్మాణాలు, కొనుగోళ్లు వస్తాయి. ప్రభుత్వ నిధులు దేనికి విడుదల చేస్తే దానికే వాడుకోవాలి. కేటాయింపు అభివృద్ధి పేరిట వస్తేనే విద్యాసంస్థల సదుపాయాలకు వర్తిస్తుంది. 2025-26 బడ్జెట్లో యూనివర్సిటీల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
సాంకేతిక విద్యకు వెచ్చించాల్సిన రూ.14 కోట్లలో ఒక కోటి మాత్రమే విడుదలైంది. హైదరాబాద్‌లోని మరో ప్రతిష్టాత్మక కోఠి మహిళా కళాశాలకు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీ హోదా కల్పించి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’ అని నామకరణం చేసింది. 2024లో ప్రస్తుత ప్రభుత్వం ఆ యూనివర్సిటీ పేరులో ‘తెలంగాణ’ను తొలగించి ‘వీరనారి చాకలి ఐలమ్మ’ పేరును చేర్చింది. ఉస్మానియా యూనివర్సిటీ మాదిరిగానే ఈ విద్యాసంస్థకు కూడా ప్రభుత్వం ఈ ఏడాది రూ.514 కోట్లు కేటాయించింది. అయితే ఈ సంస్థకు ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా నిధులు విడుదలైనట్లు తెలుస్తున్నది.
ఓయూకు రావలసిన రూ.వెయ్యి కోట్లకు తగినట్లు ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. యూనివర్సిటీ గేట్ నుంచి మొదలు 19 రకాల మార్పులకు రచన పూర్తయింది. కొత్త భవంతులు, సైక్లింగ్ ట్రాక్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, లైబ్రరీ, జిమ్, యాంఫీ థియేటర్, మల్టీ పర్పస్ హాల్, డైనింగ్ సెంటర్, ఆరోగ్య కేంద్రం ఇలా ఉస్మానియాను ప్రపంచ స్థాయిలో ఒకటిగా మార్చే ఎన్నో ఆలోచనలు వారి మదిలో ఉన్నాయి. క్యాంపస్ మొత్తంగా డిజిటల్ సమాచార వ్యవస్థ, ఉత్తమ విద్యార్జన వాతావరణం, ఆధునిక బోధనా పద్ధతుల సదుపాయం కల్పించవచ్చు. మారుతున్న విద్య, ఉద్యోగ అవకాశాల కారణంగా యూనివర్సిటీలో చేపట్టవలసిన మార్పులు భారీగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఆవరణలో ఉన్న చాలా కోర్సులు వివిధ కారణాల వల్ల జీవనోపాధిని అందించలేకపోతున్నాయి.
1980 వరకు పీజీ చేసినవాళ్లు ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు అయ్యేవారు. ఇప్పుడు సబ్జెక్టుల ప్రాథమ్యాలు మారిపోయి మ్యాథ్స్, సైన్స్ చదువులు పెరిగిపోయాయి. ప్రభుత్వ కాలేజీలు తగ్గిపోయి విద్య ప్రైవేట్ హస్తగతం అయింది. విద్యావిధానంలో టెక్నాలజీ పాత్ర పెరిగిపోయింది.
కొత్తగా వచ్చిన కృత్రిమ మేధ ప్రపంచాన్ని ఏలుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థలు కొత్త రూపు సంతరించుకోకపోతే అవి కాలగర్భంలో కలిసిపోతాయి. యూనివర్సిటీలకు భారీ నిధుల కేటాయింపు రాజకీయ పన్నాగం కారాదు. ఉత్తుత్తి ప్రమాణంగా మిగులకూడదు. ఉస్మానియా యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు నిలువాలంటే తగిన నిధులతో ఆధునీకరణ తప్పనిసరి. విద్యార్థుల కలలను నిజం చేయాలి.
– బద్రి నర్సన్