న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీలు లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టాలను భరిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చమురు ధరలు పెంచితే అవి అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ర్టాలపై ప్రతికూల ప్రభావం పడనున్నందున వాటి ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం పెట్రో ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది.
చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలోని మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలు రోజుకు రూ.2,400 కోట్ల నష్టాన్ని ఎదుర్కోనుండగా, ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించడంతో ఈ నష్టం రూ.1,600 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు మనపై లీటర్‌కు రూ.6 భారం పడుతుంది. కాగా, 2022 ఆగస్టు తర్వాత తొలిసారిగా అమెరికా సగటున ప్రతి గ్యాలన్ పెట్రోల్‌కు 4 డాలర్లు పెంచింది.