ఇస్లామాబాద్, ఏప్రిల్ 14 : ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు ముగియలేదని, పాకిస్థాన్ వేదికగా రెండో విడత చర్చలు రెండ్రోజుల్లో జరుగుతాయని అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని మంగళవారం సూచనప్రాయంగా వెల్లడించారు. న్యూయార్క్ పోస్ట్‌తో ఆయన మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో అమెరికా-ఇరాన్ అధికారులు ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరపనున్నారని తెలిపారు. ‘మీరంతా అక్కడే ఉండండి. రానున్న రెండు రోజుల్లో కచ్చితంగా అక్కడ ఏదో జరగనుంది. మేము అక్కడికి వెళ్లడానికే ఎక్కువగా మొగ్గుచూపుతాం’ అని ఇస్లామాబాద్‌ను ఉద్దేశించి అన్నారు. కాగా, రెండు వారాల పాటు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం పాక్ వేదికగా ఈ నెల 11న జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే.
రెండో విడత చర్చలకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సంబంధం ఉందని ట్రంప్ పరోక్షంగా సూచించారు. ‘ఫీల్డ్ మార్షల్ చాలా గొప్పగా పనిచేస్తున్నారు. అందువల్ల మనం మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది’ అని ట్రంప్ తెలిపారు. కాగా, రెండో విడత చర్చల కోసం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్లు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఉన్నత వర్గాలను ఉటంకిస్తూ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. రెండు వారాల కాల్పుల విరమణ డెడ్‌లైన్ ఏప్రిల్ 21తో ముగుస్తున్న క్రమంలో దానికన్నా ముందే ఈ చర్చలు ప్రారంభమవుతాయని తెలిపింది. రెండో విడత చర్చలు ఇస్లామాబాద్‌లో గురువారం జరుగుతాయని, అందులో కచ్చితంగా ఒప్పందం జరిగే అవకాశం ఉందని మరో ఉన్నతాధికార వర్గం పేర్కొంది. అదే రోజు పాక్ ప్రధాని సౌదీ అరేబియాను సందర్శిస్తారని, తర్వాత తుర్కియేలో స్వల్పకాల పర్యటన చేస్తారని పాక్ అధికారులు వెల్లడించారు.
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు పాక్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు విఫలమైన వేళ.. సంక్షోభానికి తెరదించేందుకు చైనా ముందడుగు వేసింది. అశాంతితో నిండి ఉన్న పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని ప్రోత్సహించడానికి నాలుగు సూత్రాల మార్గసూచీని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిపాదించారు. మంగళవారం అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. ప్రాంతీయ శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం, జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించడం, సమన్వయ అభివృద్ధి, భద్రత, అంతర్జాతీయ నియమాధారిత వ్యవస్థను పరిరక్షించడం అనే నాలుగు అంశాలను ఆయన తన ప్రణాళికలో ప్రతిపాదించారు.
వ్రతం చెడింది.. ఫలితం దక్కలేదు అన్నట్టు తయారైంది మన పొరుగుదేశం పాకిస్థాన్ పరిస్థితి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అప్పులతో నెట్టుకు వస్తున్న పాక్.. పశ్చిమాసియా సంక్షోభానికి మధ్యవర్తిత్వం వహించి పెద్ద క్రెడిట్ కొట్టేయాలనుకుంది. అమెరికా, ఇరాన్, పాక్ ప్రతినిధులతో ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో భారీగా చర్చలైతే జరిగాయి. ఇరు దేశాల నుంచి పెద్దయెత్తున ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కాని, ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు దౌత్య చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లును చూసి అధికారులు కళ్లు తేలేసి, తాము చెల్లించలేమంటూ చేతులెత్తేశారు. దీంతో ఇప్పుడు తడిసిమోపెడైన హోటల్ బిల్లును ఎవరు కడతారు? ఎలా కడతారు? అని అక్కడి సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. పాక్‌లోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటళ్లలో సెరెనా ఒకటి. చర్చల సందర్భంగా వేలాది మంది పారామిలిటరీ, ఆర్మీతో హోటల్ వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అయితే చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు భారీగా అయిన హోటల్ బిల్లు ఎవరు కడతారు? అని ఒక యూజర్ ప్రశ్నించగా, ఏముంది ఐఎంఎఫ్ నుంచి మరో రుణాన్ని తెచ్చుకోవడమే అని మరొకరు కామెంట్ చేశారు.