కాంగ్రెస్ సర్కారు వివక్షపై నేత కార్మికలోకం భగ్గుమంటున్నది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, ఉపాధికి గండికొట్టడంపై కన్నెర్రజేస్తున్నది. తమ జీవితాలను రోడ్డుపాలు చేయడంపై జంగ్ సైరన్ మోగిస్తున్నది. బడ్జెట్లో మొండి చేయి చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే ధ్యేయంగా పోరుబాట పడుతున్నది. నేటి నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మూడు రోజుల పాటు కార్మికులు, యజమానులు, అసాములతో కలిసి రిలేదీక్షలు చేయబోతున్నది.
రాజన్న సిరిసిల్ల, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో సంక్షోభంలో కూరుకుపోయి, ఉపాధి లేక ఆకలికేకలతో ఉరిశాలగా మారిన సిరిసిల్లను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సిరిశాలగా మార్చారు. అప్పటి చేనేత, జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నేతన్నలకు అన్ని విధాలా అండగా నిలిచారు. నేతన్న ఆత్మహత్యలు, వలసలు, ఆకలిచావులు పారదోలాలని, చేనేత, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. తొలి బడ్జెట్లోనే 1200 కోట్లు పెట్టి.. చేనేత, మరమగ్గాల, టెక్స్‌టైల్‌కు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెట్టి కార్మికులకు చేతినిండా పని కల్పించి ఆదుకున్నారు. చేతినిండా పని కల్పించడమే కాదు, నెలకు 20 వేలు వచ్చేలా భరోసా ఇచ్చి చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. పదేళ్ల పాలనలో ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. కానీ, ప్రభుత్వం మారడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట తప్పింది. నేతన్న ఉపాధికి గండికొట్టింది. అధికారంలోకి వచ్చిననాటి నుంచే నేత కార్మికులపై సీఎం రేవంత్‌రెడ్డి వివక్ష చూపుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో 110 కోట్లు కోత పెట్టి, కంటితుడుపు చర్యగా 258 కోట్లు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీనిపై చేనేత, మరమగ్గాల కార్మికులు, యాజమానులు, అసాములు, అనుబంధ కార్మికులు మండిపడుతున్నారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం సర్కార్‌పై జంగ్ సైరన్ మోగించారు. ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్లుగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండున్నరేండ్లుగా నేతన్నలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు సమస్యలను పరిష్కరించలేకపోవడంతో పోరుబాట పట్టారు.
పదేళ్లపాటు కళకళలాడిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో మళ్లీ సంక్షోభంలోకి వెళ్తున్నది. కేటీఆర్‌పై అక్కసుతో కాంగ్రెస్ సర్కారు కార్మికులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు ఎలాంటి ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడం, బకాయిలు చెల్లించకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఆందోళన మొదలైంది. ఏడాది పాటు సాగదీయడంతో చేతినిండా పనిలేక ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై సుమారు పది మందికిపైగా నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతున్నది. తప్పని పరిస్థితుల్లో సర్కారు కంటితుడుపు చర్యగా బతుకమ్మ చీరల స్థానంలో ఇందిర మహిళా శక్తి చీరలు పెట్టి ఆర్డర్లు ఇచ్చింది. ప్రభుత్వ ఆర్డర్లు అరకొరగా ఇవ్వడంతో పరిశ్రమలో నిరంతరం ఉపాధి కరువైంది. కేసీఆర్ సర్కార్ పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో పాటు కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టూ ఓనర్ పథకంపై నిర్లక్ష్యం చూపింది. దీంతో పరిశ్రమలోని కార్మికులు నిరాశతో ఉన్నారు. కాంగ్రెస్ మూడో బడ్జెట్లోనూ నేతన్నలకు అన్యాయమే జరిగింది. దీంతో సర్కార్‌పై భరోసా లేక పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వంపై నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు.
తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి చేనేత, పవర్‌లూం పరిశ్రమలతో పాటు అనుంబంధ రంగాల కార్మికులు, యజమానులు, అసాములు, చేనేత కార్మికులు దీక్షలో పాల్గొంటారు. 25న మహాధర్నాను నిర్వహించబోతున్నారు. ఈ మహాధర్నాకు సిరిసిల్ల నుంచి భారీగా పవర్‌లూం కార్మికులు, అసాములు, యజమానులు, అనుబంధ రంగాల కార్మికులు తరలివెళ్లనున్నారు.
ప్రభుత్వం నేతన్నపై కక్ష చూపద్దు. వర్కర్ టూ ఓనర్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వ ఆర్డర్లను యథావిధిగా టెండర్లను పిలవకుండా గత సర్కార్‌లాగే అందివ్వాలి. నేతన్నలకు ఏడాది పాటు పని కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. త్రిప్ట్ పథకం, యారన్ సబ్సిడీ, విద్యుత్ బకాయిలు, బ్యాక్ బిల్లింగ్‌లు చెల్లించాలి. సోమవారం నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు రిలే దీక్ష కొనసాగుతుంది. 25న సిరిసిల్ల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఆసాములు, యజమానులం తరలివెళ్తున్నాం.
కేసీఆర్ సర్కార్ నేతన్నల అర్తి తెలుసుకోని అభివృద్ధి, సంక్షేమానికి మొదటి బడ్జెట్లోనే 1200 కోట్లు కేటాయించారు. చేనేత, మరమగ్గాల, టెక్స్టైల్ రంగానికి అభివృద్ధి పథంలో నడిపించారు. ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు చేతినిండా పని కల్పించారు. గడిచిన రెండున్నరేండ్లలో ఈ సర్కార్ నేతన్నలను చిన్నచూపు చూస్తున్నది. సంక్షేమ పథకాలకు అమలు చేయడం లేదు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు కేవలం 258 కోట్లు కేటాయించింది. గతేడాది 371 కోట్లు ఇస్తే.. ఈ సారి 110 కోట్లు కోతపెట్టింది. ఇప్పుడున్న ఈ బడ్జెట్ ఏ మూలకూ సరిపోదు. నేతన్నలను విస్మరించడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. సర్కార్ విధానం మళ్లీ కార్మికులు ఆత్మహత్యలకు పురిగొల్పే విధంగా ఉంది. ఇప్పటికైనా యథావిధిగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆర్డర్లు, వర్కర్ టూ ఓనర్ పథకాలు అమలు చేయాలి.