హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని మంచిరేవుల సరిహద్దు బీరప్ప గుడి సమీపంలో ఉన్న రాష్ట్రకూట వీరగల్లు శిల్పాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఆమని నాగిరెడ్డి విజ్ఞప్తిచేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఆయన ఈ శిల్పాన్ని పరిశీలించారు. ఈ శిల్పం కుడి చేతిలో కత్తి, ఎడమచేతిలో డాలు, నడుముకు చిన్న కత్తి, కాళ్లు, చేతులు, ఒంటిపై ఆభరణాలతో తల ముడిపై నాగుపాము పడగలను ధరించి ఉన్నదని వివరించారు. ఈ శిల్పం 10వ శతాబ్ది నాటి రాష్ట్రకూట ప్రతిమ లక్షణానికి అద్దం పడుతున్నదని, హైదరాబాద్ నగర పరిసరాల వెయ్యేండ్ల చరిత్రను తెలుపుతున్నదని పేర్కొన్నారు. చారిత్రక విగ్రహంపై ఇటీవల కాలంలో కొన్ని గీతలు చెక్కడంతోపాటు ఎరుపు రంగు పులిమారని, ఆ రంగును తొలగించి ప్రాచీనతను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ వీరగల్లు శిల్పం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తుందని, దీనికి రక్షణ కల్పించాలని స్థానిక వీరభద్ర ఆలయ పూజారులు పరమేశ్వర్, సిద్దేశ్వర్‌లను కోరారు. ఈ కార్యక్రమంలో యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి, శిల్పి శివకృష్ణ, సాగర్ పాల్గొన్నారు.