హాంకాంగ్: హాంకాంగ్ నుంచి ఆదివారం లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో గంట సేపటికే ఓ వృద్ధురాలు(60) మరణించింది. అయితే విమానయాన మార్గదర్శకాల ప్రకారం పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించడంతో 13 గంటల పాటు ఇతర ప్రయాణికులు శవంతో సహా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణికురాలి శవాన్ని నేల భాగం వేడిగా ఉండే గ్యాలీ(విమాన వంట గది)లో భద్రపరిచారు. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. విమానయాన ప్రొటొకాల్ ప్రకారం.. ఓ ప్రయాణికుడు చనిపోవడం వైద్య అత్యవసర పరిస్థితి కిందకు రాదు. మొదట మృతదేహాన్ని విమాన సిబ్బంది బాత్రూమ్లో ఉంచాలనుకొన్నా ఆ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది.
‘మృతురాలితో పాటు విమానంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యు లు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. చాలామంది విమానం హాంకాంగ్‌కు వెళ్లాలని కోరుకున్నారు. కానీ రూల్స్ ప్రకారం గమ్యస్థానం వైపే ప్రయాణించింది’ అని ఓ ప్రయాణికుడు చెప్పారు. వేడిగా ఉన్న వంటగది వద్ద శవాన్ని ఉంచడంతో శవం నుంచి వాసన వచ్చిందని కొందరు ప్రయాణం చివరలో ఫిర్యాదు చేశారు. విమానం లండన్‌కు చేరుకోగానే పోలీసులు 45 నిమిషాల పాటు మిగతా ప్రయాణికులందరినీ అలాగే విమానంలో ఉంచి దర్యాప్తు పూర్తి చేశారు. ‘ప్రయాణికురాలి శవ నిర్వహణలో ప్రామాణిక పద్ధతి పాటించాం. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మేం మా సిబ్బందికి అండగా ఉన్నాం’ అని బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.