మధిర, ఫిబ్రవరి 8 : మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడతామని, మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐలతో కలిసి బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మధిర మున్సిపాలిటీలోని 18వ వార్డు సీపీఎం అభ్యర్థి పంతంగి నాగయ్య గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు కేసీఆర్ ప్రభుత్వం మధిర పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిందని గుర్తుచేశారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పాత అభివృద్ధి పనులను ధ్వంసం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
నిధులు లేకపోయినా ఎన్నికలు రాగానే హడావుడిగా శిలాఫలకాలు వేస్తూ, 100 పడకల ఆసుపత్రిని ఓట్ల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. 22 వార్డుల్లోని పేదల సమస్యల పరిషారం కావాలంటే మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం నాయకుడు పొన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే బీఆర్ఎస్ మద్దతుతో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిత్తూరు నాగేశ్వరరావు, ఆరిగె శ్రీనివాసరావు, శీలం నరసింహారావు, కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.