సిద్దిపేట, డిసెంబర్ 5: ప్రశ్నించే గొంతులను నొక్కడమే ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, సీనియర్ నాయకులు పాల సాయిరామ్, మెహన్‌లాల్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేం ద్రంలోని హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు గుండు భూపేశ్, కాముని శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనుకరాజుతో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇది ప్రజాస్వామ్యమా… నిర్బంధకాండనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసినందుకు అతడి ఇంటికి వెళ్తే హరీశ్‌రావును అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించడం సిగ్గుచేటన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేపై ఉల్టా కేసు పెట్టడం దారుణమన్నారు. అక్రమ అరెస్టుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమా.. నిరంకుశ పాలనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టినందుకే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును ఆరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆగస్టు15న నాటిని పూర్తి పంటరుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
ఎమ్మెల్యేకు అండగా వెళ్లిన హరీశ్‌రావును అరెస్టు చేయడం దారుణమన్నారు. హరీశ్‌రావు జోలికి వచ్చినవారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. పాలన పకదారి పట్టించి రేవంత్‌రెడ్డి పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లు అవినీతి అని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఖాకీలకు, తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని..ఖబడ్ద్దార్ రేవంత్‌రెడ్డి అని హెచ్చరించారు. సమావేశంలో సోమిరెడ్డి, ఎల్లారెడ్డి, రామచందర్‌రావు,ప్రభాకర్ వర్మ, కనుకరాజు, రవీందర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, సుందర్, అరవింద్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, ఎల్లయ్య, శ్రీకాంత్,రెడ్డి యాదగిరి పాల్గొన్నారు.