హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా శాపనార్థాలు పెట్టడమెందుకు?’ అని మాజీ ఎంపీ మాలోతు కవిత ప్రశ్నించారు. మంత్రి సీతక్కకు దమ్ముంటే తన అనుచరులు సాగించిన ఇసుక దందాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీల ఇబ్బందులకు కారణమైన జీవో-49ని రద్దు చేయించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్పై, కేటీఆర్‌పై బురదజల్లితే సహించబోమని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మహిళా నాయకులు తుల ఉమ, సుమిత్రాఆనంద్, కీర్తిలత, పార్టీ నేత రాంచంద్రనాయక్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై ములుగులో సీతక్క చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం మెప్పుకోసమే కేటీఆర్‌పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేటీఆర్‌పై ఆరోపణలు చేసే ముం దు మావోయిస్టులు చేసిన ఆరోపణలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కి చేసిన ఫిర్యాదులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క.. రియ ల్ మంత్రి కాదు, రీల్స్ మంత్రి అని ఎద్దేవా చేశారు. ఆమెకు స్వాతిముత్యంలా నటించడమే తప్ప అభివృద్ధి చేయడం చేతగాదని మండిపడ్డారు. అక్రమా లు, అవినీతిని ప్రశ్నించిన వారిపై సీతక్క తన అనుచరులతో దాడులు చేయిస్తున్నదని, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై, జర్నలిస్టులపై దమనకాండకు దిగుతున్నదని దుయ్యబట్టారు. మారుమూలములుగును జిల్లాగా చేసిన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టించిన కేసీఆర్‌పై దూషణలకు దిగడం బాధాకరమని పేర్కొన్నారు.
అధికారమదంతో పిచ్చిమాటలు: తుల ఉమ
అధికారమదంతో మంత్రి సీతక్క కేటీఆర్‌పై పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. కేటీఆర్‌తో ఆమెకు ఏమన్నా గెట్టు పంచాయితీ ఉన్నదా? వ్యక్తిగత విమర్శలు చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆదివాసీ బిడ్డ అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్టు మాట్లాడవచ్చా? అని నిలదీశారు. మహిళలకు ఇది చేశాం.. అది చేశాం అని చెప్పుకోవడం తప్ప ఉద్ధ్దరించిందేమీలేదని సుమిత్రా ఆనంద్ విమర్శించారు. ఇవ్వాళ ప్రెస్‌క్లబ్‌కు పిలిచిన కేటీఆర్.. రేపు కల్లు కాంపౌండ్‌కు పిలుస్తారంటూ వెటకారంగా మాట్లాడి జర్నలిస్టులను అవమానపరిచిన జగ్గారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.