Bollam Mallaiah Yadav : కోదాడ నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని నమ్మబలికి.. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ సమస్యలు చెప్పుకుందామంటే నెలకు మూడు సార్లైనా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం కోదాడలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కోదాడ పట్టణంతోపాటు మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే తయారై ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులతో కుమ్ముకై అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
పోలీసుల చిత్రహింసలతోనే దళిత బిడ్డ రాజేష్ దుర్మరణం పాలయ్యారని, అసలు దోషి సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదని, ఆయనను ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తం కాపాడుతున్నారని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రాజేష్ మృతికి చిత్రహింసలే కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధారాలు బహిర్గతం చేసినప్పటికీ ఎస్సైని సస్పెండ్ చేయకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. రాజేష్ మృతికి కారణమైన వారికి శిక్ష పడేంత వరకు దళిత ఉద్యమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందిందని మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. నాడు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తాను శంకుస్థాపనలు చేసి పూర్తిచేసిన అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఈ రెండు సంవత్సరాల్లో కోదాడలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఉదాహరణలతో సహా ఆయన వివరించారు. నియోజకవర్గంలోని బేతవోలు నారాయణ గూడెం. తదితర గ్రామాల్లో పోలీసుల అక్రమంగా తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు దాడులు నిర్వహించారని ఆయన మండిపడ్డారు. దాడులు, ఉద్యమాలు తమకు కొత్త కావని, విద్యార్థి దశ నుంచే ఉద్యమాల నుంచి ఎదిగానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునని, పోలీసులు అధికార పార్టీకి తాబేదారులుగా మారితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కోదాడ పట్టణ స్టేషన్ అధికార పార్టీకి కార్యాలయంగా మారిందని, అకారణంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మట్టి మాఫియాలకు, వైన్ షాపు యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్న ముడుపులు ఎవరికోసమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కోదాడ మున్సిపాలిటీ అవినీతి కంపులో కొట్టుమిట్టాడుతుందని, పాలన గాడి తప్పిందన్నారు.. తీర్మానాలు లేకుండా కోటి రూపాయల అవినీతి జరిగినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపాలిటీ కొత్త భవనానికి మార్చేందుకు రవాణాకు రూ.25 లక్షలు బిల్లు వేసి అవినీతి చేసినప్పటికీ పట్టించుకున్న దిక్కు లేదని యల్లయ్య యాదవ్ అన్నారు.
ఆర్డీఓ చొరవ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులతో కోదాడ పట్టణంలో నిరుపేదలు భయభ్రాంతులకు గురవుతుంటే.. తాము భరోసా ఇచ్చామని, తాము వెళ్లేదాకా ఎమ్మెల్యేకి ఈ విషయం తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కోదాడ పట్టణంతోపాటు నియోజకవర్గంలో జరిగిన అవినీతి అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని, కానీ, అనామకులతో మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు ఎస్కే నయీమ్ పైడిమరి సత్యబాబు, జానకి రామాచారి. దేవ బత్తిని సురేష్, తొగరు రమేష్, నర్సిరెడ్డి, ఉపేందర్, శివాజీ, భాగ్యమ్మ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.