Aadhaar Lock : ఇండియాలో ప్రతి పౌరుడికి గుర్తింపు ఇచ్చే ఆధార్ తో ఉన్న ఉపయోగాల గురించి తెలిసిందే. అయితే, చాలా చోట్ల మనకు తెలియకుండానే మన ఆధార్ వాడేస్తుంటారు. కొన్ని సంస్థలు మన ఆధార్ ను దుర్వినియోగం చేస్తున్న పరిస్తితులున్నాయి. దీనివల్ల వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలుగుతోంది. అందుకే ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆధార్ ను లాక్ చేసుకోవాలి.
మనకు అవసరమైనప్పుడు మాత్రమే అన్లాక్ చేసుకుని వాడుకోవాలి. ఆధార్ లాక్, అన్లాక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి. యుఐడీఏఐ వెబ్ సైట్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా మీ ఆధార్ ను లాక్, అన్లాక్ చేసుకోవచ్చు. ఆధార్ సైట్ లోకి వెళ్లి మై ఆధార్ సెక్షన్ పై క్లిక్ చేయాలి. అందులో ఆధార్ లాక్, అన్లాక్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో యూఐడీ లాక్ సెలెక్ట్ చేసుకుని, అక్కడ అడిగే యూఐడీ నెంబర్, పేరు వంటి డీటైల్స్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కు ఒక పాస్ వర్డ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ ఆధార్ లాక్ అవుతుంది. దీంతో వెంటనే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
యాప్ వాడాలి అనుకునేవాళ్లు ప్లే స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ రిజిష్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీతో లాగిన అవ్వాలి. అందులో సర్వీస్ సెక్షన్లో ఆధార్ లాక్, అన్లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా లాక్ సెలక్ట్ చేసుకుంటే చాలు.. మీ ఆధార్ ఇంకెవరూ వాడలేరు. ఒకవేళ మీకు మళ్లీ కావాలనుకుంటే ఇదే సెక్షన్లోకి వెళ్లి అన్ లాక్ చేసుకుంటే సరిపోతుంది.