జయశంకర్ భూపాలపల్లి, జూన్ 3 (నమస్తేతెలంగాణ) : విజన్‌లేని రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదలుకొని కిందిస్థాయి ఎమ్మెల్యేల వరకు అసత్య ప్రచారాలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పు కాగ్ నివేదికలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం బహిర్గతం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం అప్పులు చేసింది.. ఆ అప్పులు కట్టడానికే తమ సమయం సరిపోతున్నదని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇటీవలే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అవసరమైతే తెలంగాణ భవన్‌కు చర్చకు వస్తా.. బీఆర్ఎస్ వాళ్లు సిద్ధమా..? అని సవాల్ విసరగా, గురువారం తమ నాయకుడు కేటీఆర్ చర్చకు సిద్ధపడ్డారని, మళ్లీ మంత్రి జూపల్లి వేదిక మార్చడం సిగ్గుచేటన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయి 2 ఏండ్ల 7 నెలలవుతున్నదని, నీవు దేనికి ప్రాధాన్యం ఇస్తున్నావు.. అసలు నీ విజన్ ఏందని ప్రశ్నించారు. విద్యాశాఖను నీ దగ్గర పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టావని, దీంతో అనేకమంది పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారని అన్నారు.
ఇక జిల్లా ప్రధాన వైద్యశాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, మృతదేహాల మాంసాన్ని కుక్కలు ఎత్తుకుపోయే దీనస్థితికి వచ్చిందన్నారు. పేదలందరికీ ఉచిత వైద్యం అందాలని ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రితోపాటు మెడికల్ కాలేజీని తీసుకొస్తే, కాంగ్రెస్ వచ్చాక వైద్యశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. భూపాలపల్లిలో జనాభా పెరిగిందని, రోడ్డు ప్రమాదాలను నివారణకు, పెద్ద వాహనాలను దారి మళ్లీంచడానికి బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపి, సర్వే చేయించి, నిధులు తీసుకొస్తే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కుట్రలతో ఆపేశాడని అన్నారు. తద్వారా అన్ని వాహనాలు జాతీయ ప్రధాన రహదారి గుండా పోవడంతో ఇటీవలే డీటీవో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపాడు.
ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికే తాకుతుందన్నారు. జెన్కో వచ్చిన తర్వాత బొగ్గు బ్లాకు కావాలని ప్రతిపాదనలు పంపగా అప్పటి కేంద్రప్రభుత్వం తాడిచెర్ల ఓసీ బ్లాక్‌ను తవ్వించింది. ఇక్కడి నుంచి జెన్కోకు బొగ్గు సరఫరా చేసేందుకు కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు కోసం భూ సర్వే పూర్తయిందన్నారు. పరిహారం చెల్లించినా కన్వేయర్ బెల్ట్ ఎందుకు వేయడంలో లేదో తెలుపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ప్రజలు కాంగ్రెసోళ్లను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, మోతే రాజు, జ్యోతుల మంజులావెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు రాజుపటేల్, రవీందర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, రవికుమార్, తిరుపతి, మురళీధర్, చిరంజీవి పాల్గొన్నారు.