హనుమకొండ, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిన వారినీ వదలకుండా నిర్బంధిస్తున్నది. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు జవాబు చెప్పలేక పారిపోయిన కాంగ్రెస్ సర్కార్… వరంగల్లోనూ అదే తీరుగా వ్యవహరించింది. ప్రభుత్వ భూముల అమ్మకంలో అవినీతిపై ప్రశ్నించిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కుటుంబ సభ్యులు, బంధువులతో ఉన్నప్పుడు ఓ హోటల్ గదిలో నిర్బంధించారు. భద్రకాళీ ఆలయానికి వెళ్తున్న ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని నిర్బంధించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది.
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలకు అనుగుణంగా వారికి అండగా నిలుస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలను పోలీసులు ఇబ్బందులు పెట్టారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) జూన్ 21న వరంగల్ నగరంలో చేపట్టిన ప్రభుత్వ భూముల అమ్మకంలో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని, కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి పోటీ లేకుండా తక్కువ ధరకు భూములు దక్కించుకున్నారని దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. భూముల అమ్మకంలో అవినీతిని నిరూపిస్తామని స్పష్టంచేశారు. దీనిపై కాంగ్రెస్ తరఫున ‘కుడా’ చైర్మన్ స్పందించి ప్రతి సవాల్ చేశారు. బాలసముద్రంలోని కమర్షియల్ ప్లాట్ల వేలంలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి శుక్రవారం భద్రకాళీ అమ్మవారి వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు వెళ్లగా ఆలయ ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా నిర్బంధించి మట్టెవాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. అదే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లిన దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు గదిలో నిర్బంధించారు. వినయ్‌భాస్కర్ అక్కడ ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ చుట్టూ భారీగా మోహరించారు. రెండుమూడు గంటలపాటు హోటల్ నుంచి బయటికి రాకుండా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున హోటల్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. కొద్దిసేపు ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. మర్రి యాదవరెడ్డి అరెస్టు అనంతరం మరో గంటపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూసినా కాంగ్రెస్ వారు రాలేదు. ఆ తర్వాత ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మరికొందరు అధికార పార్టీ నాయకులు పెద్ద కాన్వాయ్‌తో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని హడావుడి చేశారు. భూముల అమ్మకంలో బీఆర్ఎస్ విసిరిన సవాల్‌పై మాత్రం స్పందించలేదు.
ప్రభుత్వ భూముల అమ్మకంలో అవినీతిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోలీసులతో నిర్బంధిస్తున్నారని, అయినా పోరాటం ఆపేది లేదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నామనే గర్వంతో అక్రమాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. కుడా ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంలో అవినీతి జరిగిందని సవాల్‌ను స్వీకరించి బీఆర్ఎస్ నాయకుడు మర్రి యాదవరెడ్డి భద్రకాళీ ఆలయానికి వెళ్తే అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. అల్పాహారం కోసం బంధువులతో హోటల్‌కు వెళ్లిన తనను నిర్బంధించడం ఏందని ప్రశ్నించారు. కుడా ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన భూముల వేలంలో అవినీతి జరిగిందని చెప్పారు. ఎన్నారైలు, డాక్టర్లు ఈ వేలం పాటల్లో పాల్గొనకుండా అధికార పార్టీ వారు బెదిరించారని ఆరోపించారు. గజం రూ.లక్షా 50వేల వేలు పలికే భూమిని అధికార పార్టీ నాయకులు సిండికేట్ అయ్యి రూ.60 వేలు, రూ.65 వేలకే దక్కించుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి అనుచరులు బెదిరించి ప్లాట్లను సొంతం చేసుకున్నారని మండిపడ్డారు. వేలం ప్రక్రియను ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో చేపట్టారని, ఈ ప్రక్రియలో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ నగరం అభివృద్ధి చెందకుండా, అవినీతి అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.