హైదరాబా ద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో కరువు తరుము కొస్తుంటే, కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మండిపడ్డారు. కరువుపై సమీక్షించి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై అక్కసుతోనే కాళేశ్వరాన్ని పండబెట్టి తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని ఆరోపించారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అటు ప్రధాని మోదీ, ఇటు అధిష్ఠానం మెప్పు కోసం ఆరాటపడుతూ సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి నీట్ విద్యార్థులు ఇప్పుడు గుర్తుకువచ్చారా? అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త ప్రాజెక్టుల పేరిట కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. సివిల్‌సప్లయ్ మంత్రి హుజూర్‌నగర్‌ను అక్రమ విత్తనాలు, కల్తీ మద్యానికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు.