హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజన్లతో పాటు పీసీ వర్క్ కింద పనిచేస్తున్నవారు, అన్మెన్ లేబర్లను రెగ్యులరైజ్ చేయాలని, తమకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం మింట్‌కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం గేటు వద్ద మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ ఆర్టిజన్లు చేసిన నినాదాలతో మింట్‌కాంపౌండ్ దద్దరిల్లింది. అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆర్టిజన్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గొంతెత్తి నినదించారు.
‘మీకు ఆ నాటి తెలంగాణ ప్రభుత్వం బాగా న్యాయం చేసింది.. మీకు అదే ఎక్కువ.. మిమ్మల్ని తీసేసి మీకు ఇచ్చే జీతంతో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులను పెట్టి నడిపిస్తాం’ అంటూ ఆర్టిజన్ల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ పెద్దలు, విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారని, ఇటువంటి మాటలతో తాము చాలా బాధపడ్డామంటూ నేతలు చెప్పారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఆర్టిజన్ల ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. ఉద్యమాలతోనే డిమాండ్లను సాధించుకోగలుగుతారని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని అన్నారు. ఆర్టిజన్ జేఏసీ కన్వీనర్ సాయిలు మాట్లాడుతూ మూడునెలల క్రితం తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగినపుడు ఎమ్మెల్సీ కోదండరాం, అద్దంకి దయాకర్ మధ్యవర్తిత్వం చేసి ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించేలా చూస్తామంటూ ప్రభుత్వం తరఫున హామీ ఇప్పించారని అన్నారు. మూడు నెలలుగా ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు తమ డిమాండ్ల పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని, తాము ఎన్నిసార్లు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలను కలువడానికి ప్రయత్నించినా స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టినట్టు జేఏసీ నేతలు తెలిపారు.
ధర్నాలో పాల్గొనడానికి వెళ్లినవారిపై చర్యలు ఉంటాయంటూ విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు చెప్పడంపై ఆర్టిజన్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే తాము మహాధర్నాకు దిగామని చెప్పారు. వారంలోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టిజన్ జేఏసీ నేతలు చెప్పారు. ధర్నాలో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాక్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, కో చైర్మన్ సుధాగని శ్రీధర్‌గౌడ్, కన్వీనర్లు సాయిలు, చంద్రారెడ్డి, కోకన్వీనర్ చందర్‌సింగ్, వైస్చైర్మన్లు సంతోష్‌నాయక్, చింతల ఎల్లయ్య, జాయింట్ సెక్రటరీలు అలీఖాన్, ఎన్ వెంకన్న, ట్రెజరర్ పరశురాములుతో పాటు వివిధ జిల్లాల ఆర్టిజన్ సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.