మామిళ్లగూడెం, జూలై 22: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు పేరు ముసాయిదా జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమ పురోగతిపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఐఆర్లో భాగంగా బీఎల్వోలు ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు.
ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని, సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, అక్టోబర్ 8 నాటికి వాటిని పరిష్కరిస్తామని, అక్టోబర్ 12న తుది జాబితాను ప్రచురిస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 81.66 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లాలో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి కావడానికి ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకుల సహకారం ఉండాలని కోరారు. ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన మరింతగా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఎస్డీసీ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ఎంఏ రాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.