కొల్లాపూర్ : రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ఆందోళన తప్పదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harshavardhan Reddy ) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని ఎన్మన్ బెట్ల గ్రామంలో ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పాటు ప్రతి బస్తాపై కమిషన్ ( Commission) అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు.
40 కేజీల వరి ధాన్యపు బస్తాకు 11 కిలోలు వరి ధాన్యాన్ని తరుగుగా తీస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో 15వేలధాన్యం బస్తాలు మిగిలిపోయాయని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యం బస్తాల నుంచి కూడా ఒక్కొక్క బస్తాకు 11 కిలోల తరువు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజవర్గంలో రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో మంత్రులు కమిషన్లు తీసుకొని ఫైల్స్ ను క్లియర్ చేస్తుంటే నియోజవర్గాల్లో అధికార పార్టీ నాయకులు జె టాక్స్ ( J Tax ) వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించడం పై సోయలేని ప్రభుత్వం రైతుల పంటపై గద్దల మాదిరిగా వాలి కొల్లగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. యన్మన్ బెట్ల గ్రామంతో పాటు నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందన్నారు. రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని రైతులకు భరోసానిచ్చారు.
రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, రైతులకు అన్యాయం జరగనియ్యనని పేర్కొన్నారు . మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు సురేందర్రావు, మాజీ ఎంపీపీ రజిత, భాస్కర్ గౌడ్, తదితరులు ఉన్నారు.