కొల్లాపూర్, ఫిబ్రవరి 03, 2026 : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అబద్ధాల పుట్ట అని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పట్టణంలోని పలు వార్డులలో ఉధృత ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగట్టారు. గ్యారెంటీ కార్డులతో ప్రచారంలో భాగంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పంపిణీ చేసిన ఆరు గ్యారెంటీ కార్డులను స్వయంగా ప్రజలకు చూపిస్తూ వాటిలో నెరవేరని హామీలను వివరించారు.
అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా అర్హులైన వారందరికి ఆరు గ్యారెంటీలు అందలేదని, ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.56.91 కోట్లతో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయిన పనులను ప్రజల ముందు ఉంచారు. పట్టణంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, హిందూ స్మశాన వాటికకు స్థల సేకరణ వంటి పనులు బీఆర్ఎస్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
అభివృద్ధి ఆగకూడదంటే కారు గుర్తుకే ఓటు వేయాలన్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణానికి నిధులు వస్తాయని భరోసా ఇచ్చారు. కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాంలను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జై తెలంగాణ – జై బీఆర్ఎస్ నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు.