కవాడిగూడ, జూలై 18: సర్పంచుల సమస్యలను రాజకీయ కోణంలో చూడరాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్పంచులు తమ సొంత నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్ లకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు ఏ సమస్య వచ్చిన అండగా నిలిచిందని, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా, ప్రజా ప్రతినిధుల ఫోరం నాయకునిగా సర్పంచులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి అండగా నిలుస్తానని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పొంగులేటి చేసిన పనులకు ఈ ప్రభుత్వం బిల్లులు ఎట్లా ఇచ్చిందని, సర్పంచులకు బిల్లు ఎందుకు చెల్లించదని ప్రశ్నించారు.
ఆయనకో లెక్క సర్పంచులకు ఒక లెక్కా అని నిలదీశారు. మీ వైతే పైసలు సర్పంచులవి పైసలు కావా అని అన్నారు. సర్పంచ్ల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెఏసి అధ్యక్షులు యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ నాయకులు మధు, నాగయ్య, మధుసూదన్ రెడ్డి, సుభాష్ గౌడ్, నవీన్ గౌడ్, రాజేందర్, మల్లేష్ శారద కల్పన రమేష్, తదితరులు పాల్గొన్నారు.