హైదరాబాద్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డితో(Jeevan Reddy) పాటు అతడి అనుచరులు నేడు(శుక్రవారం) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను(KCR) ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్లో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డిని కేసీఆర్ మధ్యాహ్నా భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్లో చేరిక తేదీ, రాష్ట్రంలోని ఇతర రాజకీయ అంశాలపై చర్చింనున్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నట్లు సమాచారం.
కాగా, ఇటీవలే జీవన్ రెడ్డిని కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జననేతగా జీవన్‌రెడ్డికి పేరుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని, సాదరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కలిసి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనతో గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌తో జీవన్‌రెడ్డికి మంచి అనుబంధం, స్నేహం ఉందని తెలిపారు.