సైదాబాద్, జూన్ 3 : ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నదని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి చంచల్‌గూడ జైలులో ఉన్న సుమన్‌తో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు.
బాల్క సుమన్‌పై పెట్టిన సెక్షన్లను చూసి జడ్జి సైతం ఆశ్చర్యపోయారని, దేశంలో ఉన్న అన్ని సెక్షను, హత్య, ఆయుధాలు వంటి కేసులు నమోదు చేయడం విడ్డూరమని, ఆయనపై పెట్టిన కేసులపై కోర్టులో న్యాయపోరాటం చేసి న్యాయబద్ధంగా మద్దతు అందిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు, జైళ్లు కొత్తకాదని పేర్కొన్నారు. ప్రభుత్వ దమననీతిని ప్రజలకు అర్థం చేయిస్తామని, అణచివేతను ఎదుర్కొంటామని స్పష్టంచేశారు.
పదేండ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన చూపిన దారిలో తాము నడుచుకొంటున్నామని తెలిపారు. చిన్న గదిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన సంబంధంలేని విషయాలను వక్రీకరించి తప్పుడు కేసును పెట్టిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి సీఎం, మంత్రులు.. పోలీసులను ఉపయోగించుకొంటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారందరిపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తామనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వమని పేర్కొన్నారు. అక్రమ కేసులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. ఈ మధ్య అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను భయపెట్టి డబ్బులు వసూళ్లు చేసుకోవడానికి ఫ్యాక్టరీ, ఇండ్లను పేల్చివేస్తామని బహిరంగంగా మాట్లాడినా ఎక్కడ చిన్న కేసులు కూడా పెట్టలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.