అడ్డగుట్ట/ ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 3 : అర్హులైన వారి ఓట్లు ఒక్కటి కూడా తొలగించకుడా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి మల్లిపర్పస్ ఫంక్షన్ హాల్లో స్ఫెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం బీఆర్ఎస్ యువనేత రామేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… సికింద్రాబాద్ నియోజకవర్గం తెలంగాణ వాదానికి కంచుకోటగా మారిందని, ఓటర్లను చైతన్యవంతులను చేశామని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యభూమిక పోషించాలని, అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా బూత్ స్థాయి ఏజెంట్లు జాగత్తలు తీసుకోవాలని సూచించారు.
ఓట్ల తొలగింపు కుట్రలతో పార్టీలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయని, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కిందిస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు క్రియాశీలక పాత్ర పోషించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. వెస్ట్ బెంగాల్లో ఓట్ల తొలగింపు మూలంగానే బీజేపీ గెలిచిందని, ఎస్ఐఆర్ను దుర్వినియోగం చేస్తూ ఎలాంటి చర్యలకు పాల్పడొచ్చో మనకు బెంగాల్ ఎన్నికలు మంచి ఉదాహరణ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంపై కొందరు నాయకులు అనవసర అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అస్థిత్వంపై కుట్ర జరుగుతుంది, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణపై కుట్రలు జరుగుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఏ మాత్రం నమ్మకుండా వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.
ఎస్ఐఆర్పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్ సూచించారు. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కొందరు నాయకులు పనికట్టుకొని అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ని గెలుపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి యువత ఎంతో అవసరమని, అంతేకాకుండా డిజిటల్ మీడియా విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని ఆయన తెలిపారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మాజీ కార్పొరేటర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం, బీఆర్ఎస్ యువ నాయకులు కిషోర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్, రాసూరి సునీత, కంది శైలజా తదితరులు పాల్గొన్నారు.