న్యూఢిల్లీ: వర్షాకాలంలో నైరుతి పవననాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని, ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి అత్యవసర ప్రణాళికలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ మంగళవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించింది. కృషి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడం, కరువును తట్టుకునే, స్వల్పకాలిక విత్తనాల లభ్యత, తేమ సంరక్షణ, జలాశయ నీటిని శాస్త్రీయంగా ఉపయోగించడం వంటి అంశాలకు సన్నాహక చర్యల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అత్యవసర చర్యలు స్థానిక పరిస్థితుల ఆధారంగా అమలు చేయాలని, అవి కాగితాలకే పరిమితం కాకూడదని ఆయన అధికారులకు చెప్పారు. రెండు నుంచి నాలుగు వారాలపాటు వర్షం కురువకపోతే తిరిగి విత్తనాలు నాటడం, ప్రాణరక్షక నీటిపారుదల, ప్రత్యామ్నాయ పం టల కోసం స్పష్టమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని చౌహాన్ రాష్ర్టాలను కోరినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. రైతులకు త్వరితగతిన చేరువయ్యేందుకు డిజిటల్, కాల్-సెంటర్ సలహాలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని, రాష్ర్టాల స్పందన బలహీనంగా ఉన్నచోట కేంద్ర మద్దతును అందిస్తుందని ఆయన తెలిపారు.