అడవిదేవులపల్లి, సెప్టెంబర్ 24 : అడవిదేవులపల్లి మండలం గోన్యా తండాకు చెందిన మహిళా రైతు పాత్లోతూ దస్సి యూరియా కోసం లైన్లో నిలబడి తోపులాటలో తుంటి వెనుక విరిగి, శస్త్ర చికిత్స అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, నోముల భగత్‌తో కలిసి దస్సి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఒకే ఒక్క ఎకరం భూమి ఉన్న ఈ గిరిజన కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అన్నారు. ఎకరా భూమికి కూడా సకాలంలో సరిపడా యూరియా అందించని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య ఇదన్నారు. పేరుకు గొప్పగా ప్రజా పాలన అంటారు కానీ ఇంతవరకు ఈ పాతులోతు దస్సి కుటుంబాన్ని పరామర్శించిన వాళ్లు కూడా లేరని దుయ్యబట్టారు. పరామర్శించకపోగా ఆ గిరిజన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ప్రభుత్వమే అన్నిరకాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Adavidevulapally : దస్సి కుటుంబానికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ