తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ( Tirumala Brahmotsavam ) ఘనంగా ప్రారంభమయ్యాయి . బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు, ఈవో అశోక్ సింఘాల్ ఆధ్వర్యంలో పూజల అనంతరం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు సకల దేవతా మూర్తులను శాస్త్రోక్తంగా ఆహ్వానించే కార్యక్రమమైన గరుడ ధ్వజ పటాన్ని ధ్వజస్తంభం ఎగురవేశారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రమని అర్చకులు వెల్లడించారు. అనంతరం స్వామివారి మూర్తులను పెద్ద శేష వాహనంపై ఊరేగించారు. గురువారం ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని అధికారులు వివరించారు.
ఈనెల 26న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటలకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 27న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై కటాక్షిస్తారని వెల్లడించారు. 28న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6 .30 గంటల నుంచి గరుడ వాహనం , 29న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్త్తారని వివరించారు.
30న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం, 2న ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.