జగిత్యాల, ఏప్రిల్ 19 : జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మినీస్టేడియంలో సభ ఏర్పాట్లను నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సభ అంటేనే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే ఉరుక్కుంటూ మేడిగడ్డను చూస్తాడట అని విమర్శించారు. రెండున్నరేళ్లుగా సమయం దొరకని రేవంత్‌కు కేసీఆర్ సభ రోజే మేడిగడ్డ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న పనిగా అందరూ గుర్తిస్తారన్నారు. కేసీఆర్ సభకు లక్ష మందికి పైగా వస్తారని, ఈ సభను విజయవంతం చేయాలన్నారు.