లోకంలో నాస్తికత్వాన్ని రూపుమాపేందుకు మనుష్య రూపంలో అవతరించిన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఆదిశంకరాచార్యులు. ఉపనిషణ్మతమైన అద్వైతాన్ని స్థాపించి, పాపకూపంలో పడి నలిగిపోతున్న మానవులకు మోక్ష మార్గాన్ని చూపించి, మార్గదర్శిగా నిలిచారు. అతి పిన్నవయసులోనే సన్యసించి, ఆ సేతుశీతాచలం నాలుగుసార్లు పర్యటించి, బౌద్ధ, జైనమతాల కుతర్కాన్ని తన వాదనా పటిమతో ఓడించి, దేశంలో సనాతన ధర్మజ్యోతిని తిరిగి ప్రజ్వలింపజేశారు.
శంకరులు తనకు జ్ఞానోపదేశం చేసే గురువు కోసం అన్వేషణ ప్రారంభించారు. కాలినడకన బయల్దేరారు. నర్మదా నదికి చేరుకున్నారు. అక్కడ జ్ఞానసమాధిలో ఉన్న గోవింద భగవత్పాదాచార్యులను చూశారు. అప్పటిదాకా చేసిన కాలినడకతో అలుముకున్న శ్రమంతా ఒక్కసారిగా మాయమైంది. గోవిందులే తనకు గురువని శంకరులు నిశ్చయించుకున్నారు. వారికి నమస్కారం చేసి, తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. జ్ఞానసమాధి నుంచి మేల్కొన్న గోవిందులు… శంకరులను చూసి ‘ఎవరు నువ్వు’ అంటూ ప్రశ్నించారు. ‘న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతి కత్వా త్సుశుష్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివః కేవలోహం’- ‘నేను నింగిని కాదు. భూమిని కాదు. నీటిని కాదు. అగ్నిని కాదు. గాలిని కాదు. ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని, వేరే చిత్తం కాని లేనివాడిని. నేను శివుడను. విభజన లేని జ్ఞానసారాన్ని’ అంటూ సమాధానమిచ్చారు శంకరులు. వచ్చినవాడు సాధారణ శిష్యుడు కాడని గోవిందులకు అర్థమైంది. ‘స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్’ సాక్షాత్తు భూమికి దిగివచ్చిన పరమశివుడే ఈ శంకరుడని గుర్తించారు. ఆయన్ను శిష్యుడిగా స్వీకరించారు. శంకరులు మొట్టమొదటిసారిగా గోవిందభగవత్పాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తుంది. గురు సేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి చాటి చెప్పారు.
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. సుమారుగా ఎనిమిది రోజుల పాటు చర్చ జరిగింది. ఎనిమిదో రోజు ముగిసే సమయానికి వృద్ధుడి రూపంలో వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని శంకరుల శిష్యుడు పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరతాడు. వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాల అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసిస్తాడు.
వేదవ్యాసుడు నిష్ర్కమించబోవడం చూసి, శంకరులు ‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుంచి ముక్తి ప్రసాదించమ’ని వ్యాసుని కోరతాడు. అందుకు ప్రతిగా వ్యాసుడు ‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించటం మంచిది కాదు. అనేకమంది ధర్మ వ్యతిరేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవదశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తున్నది. బ్రహ్మ నీకిచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్దాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్లు తోడైంది. ఇప్పుడు పరమశివుడి కృప చేత నీకు మరో 16 ఏండ్ల ఆయుష్షు లభించుగాక” అని దీవించాడు. ఈ విధంగా వ్యాసమహర్షి అనుగ్రహంతో శంకరులు 32 ఏళ్ల ఆయుర్దాయాన్ని పొంది, ఆ జీవితకాలం మొత్తాన్ని అద్వైత సిద్ధాంత వ్యాప్తికే వినియోగించారు.
ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన, వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని తలపోశారు. ఈక్రమంలోనే భారతీయ సమాజాన్ని సంస్కరించి, ఆర్ష సంప్రదాయాన్ని, సనాతన సంస్కృతిని పునరుద్ధరించి, భారతదేశం నాలుగు దిక్కుల్లో తూర్పున పూరి (ఒడిశా), పశ్చిమాన ద్వారక (గుజరాత్), ఉత్తరాన బదరీనాథ్ (ఉత్తరాంచల్), దక్షిణాన శృంగేరి (కర్ణాటక) పీఠాలను శంకరాచార్యులు నెలకొల్పారు. దేశచరిత్రలో ఈవిధమైన పీఠాల స్థాపన ఓ చిరస్మరణీయ ఘట్టం. మఠామ్నాయ పద్ధతిలో పీఠ నియమాలు, నిర్వహణ, పీఠం నిర్వహించవలసిన ధార్మిక కార్యక్రమాలు, పీఠపు అంకిత నామం, ప్రత్యేకంగా పఠించవలసిన వేదం, పీఠపు మహావాక్యం, పీఠానికి చెందిన దేవత, శక్తి, తీర్థం, క్షేత్రం, బ్రహ్మచారి, యోగపట్టం, కార్యక్షేత్రం…ఇలా ఎన్నో అంశాల్లో ఇప్పటి మన రాజ్యాంగం తీరులో మహోన్నతమైన వ్యవస్థను శంకరులు ఏర్పాటుచేసి, హిందూ ధర్మానికి మహోపకారం చేశారు. వీటిప్రకారమే మఠాలు నడుస్తూ, ధర్మదీప్తులను నలుదిశలా వెదజల్లుతున్నాయి.
శంకరుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం వల్ల క్షీణదశలో ఉన్న హిందూమతానికి ఆయన చికిత్స ప్రారంభించారు. హిందువులు అనేక శాఖలుగా చీలిపోయి తమలో తామే కలహించుకునేవారు. మీమాంస, సాంఖ్యవాదులు దాదాపు దేవుడిని నమ్మకపోగా, చార్వాకులు వేదాలను నిరసించారు. ఆదిశంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను తన వాదంతో ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుడిని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు.

శంకరుల రచనల్లో అద్భుతమైన రచనా విన్యాసాలు కనిపిస్తాయి. ఉపమ, శ్లేష, యమకాలు వంటి సాహితీవిన్యాసాలు శంకరుల రచనల్లో కోకొల్లలుగా ఉంటాయి. శంకరుల అంతర్ దృష్టికి ఉదాహరణగా ఈ ఒక్క శ్లోకం చెప్పుకొంటే సరిపోతుంది.
ఆశనం గరలం ఫణీ కలాపః
వసనం చర్మ చ వాహనం మెక్షః
మమ దాస్యసి కిం? కిస్తి శంభో?
తవ పాదాంబుజ భక్తి మేవ దేహి ॥
శంకరా! ఏమైనా తిండి పెడతావేమో అని అనుకుంటే నువ్వే విషం తిన్నావు. ఆభరణాలనిస్తావేమో ననుకుంటే ఒంటినిండా పాముల్నే ధరిస్తావు. పోనీ తిండీ ఆభరణాల మాటకేం గాని, మంచి దుస్తులైనా పెట్టేస్తే వెళ్లి పోదామనుకుంటే పగలు పులిచర్మం, రాత్రి ఏనుగు చర్మం కట్టి కన్పిస్తావు. కనీసం మమ్మల్ని ఈ అడవి చివరి వరకైనా సాగనంపి మా ఊరికెళ్లే తోవ చూపిస్తావేమో అనుకుంటే- నీ వాహనం ఎద్దు. పైగా అది ముసలిది (మహా ఉక్షః) కూడాను. ఔను! ఏమీ అనుకోకు గానీ మాకేం ఇస్తావు? ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలిగా. ఏముంది నీ దగ్గర? అసలుందా? (కిమస్తి?)- అని ఇంత వేళాకోళంగా ఆది శంకరులు ఆటపట్టించారు. చివరి మాటలో ‘సరేలే! మాకు నీ పాదాంబుజాల యెడల భక్తి ప్రసాదించు చాలు’నన్నారు ఆయనే.
ఇలా ఉన్న శంకరుణ్ని ప్రార్థించాలి కూడానా? అన్పిస్తుంది మనకి. కానీ, దాని అంతరార్థం ఏమిటంటే… నువ్వే ఆ కాలకూట విషాన్ని స్వీకరించకుండా ఉండి ఉంటే ఆ విషాగ్ని ఈ ప్రపంచాన్నే మండించి వేసేది. మేం ఉండేవాళ్లమే కాదు. మేమున్నామంటే కారణం నీ విషపానమే. నమస్కారం శివా! లోకం నిండా విషబుద్ధులే ఉన్నాయి. అలా విషం నిండి ఉన్న పాముల్ని చుట్టాల్లా ఒంటి నిండా తిప్పుకొంటూ విరోధుల్నీ, హాని చేసే వాళ్లనీ కూడా ఎలా లొంగ తీసుకోవాలో తెలుసుకోమంటున్నావా? ఎంత గొప్ప ఉపదేశం. సాష్టాంగం భవా! రజస్తమో గుణాలకి చిహ్నంగా వ్యాఘ్ర గజ చర్మాలని కట్టావా? అప్పుడప్పుడూ బుస్సుమంటూ ఉంటే గాని లోక వ్యవహారం సాగదంటున్నావా? దండాలు హరా! ధర్మానికి సంకేతం ‘ఎద్దు’ కాబట్టి ధర్మ బద్ధంగానే ఉండమంటున్నావా! దొడ్డ దేవరా వందనం! అందుకే కదయ్యా ఇది శివ (శుభాన్నిచ్చే) రాత్రి… అంటూ మాటల్లో వర్ణించలేనంత ఉన్నతంగా శివుడి ఔన్నత్యాన్ని వర్ణించారు శంకరులు. ఆయన ఘనతకు ఇదొక మచ్చుతునక మాత్రమే.
ఆదర్శమార్గం ఆదిశంకరుల ఆదర్శ గుణాల్లో జ్ఞాపకశక్తి ఒకటి. కేరళ రాజు రాజశేఖరుడు ఓ మూడు నాటకాలు రాసి వాటిని శంకరాచార్యుల ముందు వినిపించాడు. ఆ తర్వాత చాలా కాలానికి మళ్లీ శంకరాచార్యులు ఆయన దగ్గరకొచ్చినప్పుడు తాను రాసిన మూడు నాటకాలు అగ్ని ప్రమాదంలో మసి అయిపోయాయని బాధ పడ్డాడు రాజశేఖరుడు. అప్పుడు శంకరాచార్యులు ‘నువ్వు నాకు వినిపించిన నాటకాలు విన్నదివిన్నట్లు మళ్లీ చెబుతాను రాసుకో’ అని మూడు నాటకాలను, అక్షరం పొల్లుపోకుండా తిరిగి చెప్పారు. శంకరుల మేథోశక్తికి ఇదో మచ్చుతునక.
శంకర బోధనల సారాంశం మనకు గోచరించే ప్రపంచమంతా ఎండమావుల్లో నీటి లాంటిదేనని, ఇక్కడ ఉండే అన్ని ప్రాణుల శరీరాల్లోనూ జీవాత్మంగా భాసించే శుద్ధ చైతన్యం బ్రహ్మమే తప్ప వేరు కాదని శంకరులు చాటిచెప్పారు. అత్యంత క్లిష్టమైన ఆత్మజ్ఞానాన్ని అరటిపండు వలిచి చేతికి అందించినంత సరళంగా బ్రహ్మతత్వాన్ని బోధించిన అపూర్వ మేధావి ఆదిశంకరులు. ఆయన జీవితం భక్తి, జ్ఞాన, వైరాగ్యాల త్రివేణి సంగమం. అద్వైతం అంటేనే ఇతర పదార్థమంటూ ఏదీ లేదు… ఉన్నదంతా ఒక్క ఆత్మ చైతన్యమే అని అర్థం. ఈ వాదం వల్లనే ముక్తి లభిస్తుందని వేదాంత డిండిమంలో ప్రకటించారు. ‘నేనూ బ్రహ్మాన్నే’ అనే జ్ఞానాన్ని సాక్షాత్కరింప చేసుకోవటమే ఆదిశంకరుల రచనల సారాంశం.
ఆయన కురిపించిన జ్ఞానామృతం అంతులేనిది. అనితర సాధ్యమైంది. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం నేటికీ కోట్లాది జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. షణ్మతస్థాపనాచార్యుడిగా, పంచాయతన పూజావిధాన స్రష్టగా హైందవుల జీవితాలను ధర్మమార్గంలో నడిపిస్తున్న గురుమూర్తి శంకరాచార్యులు. ఆయన ప్రతిపాదించిన అద్వైతం సర్వజన సమ్మతమైంది. అద్వైతంలో అఖండత్వం ఉంది. భగవంతుడి ఏకతాస్థితమే అద్వైతం. ఈ విశ్వమే భగవంతుడు అని అంటుంది అద్వైతం. సర్వవేద శాస్త్రాల సారాన్ని ఆకళింపు చేసుకున్న జగద్గురువు ఆది శంకరులు.