ఒస్లో: నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. టోర్నీ ఫెవరేట్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద షాక్ ఇచ్చాడు. గురువారం జరిగిన మూడో రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 1-0 తేడాతో కార్ల్‌సన్‌పై చిరస్మరణీయ విజయం సాధించాడు. క్లాసికల్ ఫార్మాట్లో వరల్డ్‌నంబర్‌వన్ ప్లేయర్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకు ఇది రెండో విజయం. 2024లో ఇదే టోర్నీలో ఈ చెన్నై చిన్నోడు నార్వే స్టార్ ప్లేయర్‌పై తొలిసారి గెలిచాడు.
గేమ్‌లో ఆది నుంచే పక్కా వ్యూహాన్ని అమలు చేసిన ప్రజ్ఞానంద..కార్ల్‌సన్‌కు ఎక్కడా అవకాశమివ్వకుండా గేమ్‌ను దక్కించుకున్నాడు. మరో పోరులో దొమ్మరాజు గుకేశ్ 0-1తో అలీరెజా ఫిరాజా చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలుత క్లాసికల్ గేమ్ డ్రా కాగా, విజేత కోసం జరిగిన అర్మాగెడాన్ పోరులో గుకేశ్‌పై అలీరెజాదే పైచేయి అయ్యింది. మూడు రౌండ్లు ముగిసే సరికి అలీరెజా(7.5), ప్రజ్ఞానంద(4.5) టాప్-2లో కొనసాగుతున్నారు.
మరోవైపు మహిళల విభాగంలో భారత యువ జీఎం దివ్యాదేశ్ముఖ్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. కజకిస్థాన్ జీఎం బిబిసారా అసబయెవాతో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో దివ్య విజయం సాధించి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంది. మరో పోరులో సీనియర్ ప్లేయర్ కోనేరు హంపి 0-1తో అన్నా ముజుచుక్(ఉక్రెయిన్) చేతిలో ఓడింది. అసబయెవా(5.5), దివ్యాదేశ్ముఖ్(4.5) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.