ఒక ఊరిలో రాములవారి గుడి దగ్గర ప్రవచనకర్త రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేట్లు చెప్పారు. శ్రద్ధగా విన్న ఓ తల్లి ఇంటికి వెళ్లింది. ఆమెకు పదేండ్ల వయసున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కవలలైన వారిద్దరూ ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటారు. ఆ రోజు కూడా ఇద్దరూ గొడవపడి, చెరొక మంచంపై కోపంగా కూర్చుని ఉన్నారు. ఏమి జరిగిందని ఆమె ప్రశ్నించింది. వాళ్లిద్దరూ బదులు పలకలేదు. అన్నం తిని పడుకోమని ఆమె సలహా ఇచ్చింది. వారు బిగుసుకు కూర్చున్నారు కానీ, అమ్మ మాటకు ఏమాత్రం స్పందించలేదు. వారిద్దరి మధ్యలో ఆమె కూర్చుంది. ‘అన్నదమ్ములు ఎలా ఉండాలో మీకు రామాయణంలోని ఒక కథ చెబుతాను, వినండి’ అంది. వాళ్లు విననట్లు నటిస్తూనే, ఆసక్తిగా వినసాగారు. ‘రామాయణంలో జటాయువు, సంపాతి అనే అన్నదమ్ములు ఉండేవారు.
ఇందులో జటాయువు తమ్ముడైతే, సంపాతి అన్న. ఈ ఇద్దరూ మహాబలవంతులైన గ్రద్దలు. ఎవరు బలవంతులో తేల్చుకోవాలని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడికి దగ్గరగా ఎగరాలని పందెం పెట్టుకున్నారు. మధ్యాహ్నమయ్యింది. వేడి పెరిగిపోయింది. తమ్ముడు జటాయువు ఎగరలేకపోతున్నాడు’ అని చెప్పి ఆ తల్లి కథను ఆపింది. చిన్నకొడుకు కుతూహలంగా, ‘ఆ తర్వాత ఏమి జరిగిందమ్మా?’ అని అడిగాడు. మళ్లీ గొంతు సవరించుకుని ఆ తల్లి, ‘తమ్ముడు జటాయువును కాపాడాలని సంపాతి తన రెక్కలను అడ్డుపెట్టి, శక్తినంతా కూడదీసుకుని మరింత ఎత్తుకు ఎగిరాడు. కానీ సంపాతి…’ అని చెప్పి మళ్లీ ఆపింది.
ఆమె పెద్దకొడుకు గబగబా వచ్చి, ‘సంపాతికి ఏమయ్యింది?’ అని ఆసక్తిగా అడిగాడు. ‘తట్టుకోలేని ఆ ఎండకు సంపాతి రెక్కలు కాలిపోయాయి. రెక్కలు కాలి, ఎండను తట్టుకోలేక సంపాతి, ఎగరలేక జటాయువు ఇద్దరూ కింద పడిపోయారు. అన్నదమ్ములంటే అలా ఉండాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉండాలి. అంతే కానీ, ఇలా చిన్న చిన్న విషయాలకే గొడవ పడకూడదు’ అని హితవు పలికింది. ‘తప్పయ్యిందమ్మా, ఇంకెప్పుడూ గొడవపడం’ అని ఇద్దరూ అమ్మ చేతులు పట్టుకున్నారు. చిన్న నవ్వు నవ్వుతూ ఆ తల్లి ఇద్దరి భుజాలూ తట్టింది. ఇద్దరూ పరిగెత్తుకెళ్లి తినడానికి కంచాలు సిద్ధం చేసుకున్నారు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,93936 62821