లండన్ : ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ తీరును మార్చి ‘బజ్‌బాల్’ ఆటతో ఆ దేశంలో ఈ ఫార్మాట్‌ను జనరంజకంగా మార్చిన మాస్టర్ మైండ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. అతడిని హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2022లో టెస్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన మెక్కల్లమ్.. సారథిగా స్టోక్స్ ఆట నుంచి నిష్క్రమించిన కొద్దిరోజులకే టెస్టు కోచింగ్ పదవిని కోల్పోవడం గమనార్హం.
యాషెస్ సిరీస్‌లో దారుణ వైఫల్యం, సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమి నేపథ్యంలో ఈసీబీ అతడిని తప్పించినట్టు సమాచారం. మొత్తంగా 49 టెస్టుల్లో ఇంగ్లిష్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన అతడి హయాంలో ఇంగ్లండ్ 27 మ్యాచ్‌లు గెలిచి 20 టెస్టుల్లో ఓడి రెండింటిని డ్రా చేసుకుంది. రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి మెక్‌కల్లమ్‌ను తప్పించిన ఈసీబీ.. పరిమిత ఓవర్లలో మాత్రం అతడిని కొనసాగించింది.