జీవితంలో ఆపద కాలంలో సాయం పొందినప్పుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తపన మనిషి నిజాయితీకి నిదర్శనం. పూర్వం బనీ ఇస్రాయీల్ కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సత్య గాథను ప్రవక్త ముహమ్మద్ (స) తన సహచరులకు స్వయంగా వివరించారు. ఒక వ్యక్తికి అత్యవసరంగా వెయ్యి బంగారు నాణేలు అవసరమై, ఒక వ్యాపారిని అడిగాడు. ఆ వ్యాపారి అల్లాహ్నే సాక్షిగా పెట్టుకుని, ఎలాంటి హామీ లేకుండానే ఆ సొమ్మును అప్పుగా ఇచ్చాడు. ఆ నాణేలతో అవతలి ఒడ్డుకు వెళ్లి తన అవసరాలు తీర్చుకున్న ఆ వ్యక్తి.. అప్పు తీర్చాల్సిన గడువు రోజున నాణేలతో సముద్ర తీరానికి చేరుకున్నాడు. కానీ, వాతావరణం అనుకూలించక అవతలి ఒడ్డుకు వెళ్లే పడవ ఒక్కటి కూడా రాలేదు. ‘ఇచ్చిన మాట తప్పకూడదు, దైవాన్ని సాక్షిగా పెట్టి తెచ్చిన అప్పు ఇది’ అని అతను లోలోపల కుమిలిపోయాడు.
మనుషులు సాయం చేయలేని స్థితిలో దైవమే మార్గం చూపిస్తాడని నమ్మాడు. తీరంలో పడి ఉన్న ఒక లావుపాటి కర్రను రెండుగా చీల్చి, అందులో వెయ్యి నాణేలను, ఒక లేఖను భద్రపరిచి కర్రను మళ్లీ అతికించాడు. ‘ఓ అల్లాహ్! నా రుణదాతకు ఈ నాణేలు చేర్చే బాధ్యత నీదే’ అని వేడుకుంటూ ఆ కర్రను సముద్రంలో వదిలేశాడు. అదే సమయంలో, అవతలి ఒడ్డున ఉన్న వ్యాపారి సముద్ర తీరంలో ఎదురుచూసి నిరాశగా ఇంటికి తిరుగుపయనమయ్యాడు. వెళ్తూ వెళ్తూ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక కర్రను ‘పొయ్యి కట్టెగా పనికొస్తుంది’ కదా అని ఇంటికి తీసుకెళ్లాడు.
దానిని చీల్చి చూడగా.. ఒక్కసారిగా వెయ్యి బంగారు నాణేలు, అందులోని ఉత్తరం బయటపడ్డాయి. వ్యాపారి ఆశ్చర్యంతో ఆనందపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత, ప్రయాణాలు మొదలవగానే ఆ వ్యక్తి మరో వెయ్యి నాణేల సంచితో వ్యాపారి వద్దకు వచ్చి.. ‘ఆ రోజు పడవలు లేక రాలేకపోయాను, క్షమించు. ఇదిగో నీ అప్పు’ అని ఇవ్వబోయాడు. అప్పుడు వ్యాపారి మందహాసంతో..‘మిత్రమా! నువ్వు కర్రలో పెట్టి పంపిన నాణేలు దైవసహాయంతో ఆ రోజే నాకు అందాయి. నీ నిజాయితీ నెరవేరింది, ఈ నాణేలు నువ్వే ఉంచుకో’ అని తిప్పి ఇచ్చేశాడు. సమాజంలో అప్పు తీసుకునేటప్పుడు ఉండాల్సిన బాధ్యతను వివరించడానికే ప్రవక్త (స) ఈ కథను చెప్పారు.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076