కోల్‌కతా: ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు పరాభవాల (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అన్ని విభాగాల్లో విఫలమవుతూ ఇంటాబయటా తీవ్ర విమర్శల పాలవుతున్న కేకేఆర్.. ఆదివారం ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఆ జట్టు జోరుకు అడ్డుకట్ట వేసింది. ఇరుజట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో చివరి ఓవర్ దాకా నువ్వానేనా అన్నట్టుగా సాగిన పోరులో రాజస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి విజయాల ఖాతా తెరిచింది.
బంతితో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (3/14), సునీల్ నరైన్ (2/26) ప్రత్యర్థిని 155/9కే కట్టడి చేయగా బ్యాట్‌తో వైస్ కెప్టెన్ రింకూ సింగ్ (34 బంతుల్లో 53 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో మరో రెండు బంతులుండగానే ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొదట వైభవ్ సూర్యవంశీ (28 బంతుల్లో 46, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వీ జైస్వాల్ (29 బంతుల్లో 39, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమవడంతో రాజస్థాన్ సరిగ్గా 20 ఓవర్లకు 155 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాయల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.
71/0.. వైభవ్, యశస్వీ మెరుపులతో ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన రాయల్స్ 7 ఓవర్లకు చేసిన స్కోరది. భారీ మెరుపులేమీ లేకపోయినా ఓపెనర్లిద్దరూ గట్టి పునాధి వేయడంతో రాజస్థాన్ భారీ స్కోరుపై కన్నేసినట్టే అనిపించింది. కానీ వరుణ్ రాకతో కథ మారిపోయింది. 9వ ఓవర్లో అతడు.. వైభవ్‌ను ఔట్ చేసి కేకేఆర్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. అతడి టీ20 కెరీర్లో ఇది 200వ వికెట్ కావడం గమనార్హం. తన మరుసటి ఓవర్లో అతడు.. ఫామ్‌లో ఉన్న జురెల్ (5)నూ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే నరైన్.. జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపడంతో రాయల్స్ స్కోరువేగం నెమ్మదించింది. కెప్టెన్ పరాగ్ (12) మరోసారి విఫలమవగా నరైన్ తన ఆఖరి ఓవర్లో ఫెరీరా (7)నూ ఔట్ చేసి రాయల్స్‌ను కోలుకోనీయకుండా చేశాడు. 19వ ఓవర్లో కార్తీక్.. ఐదు బంతుల వ్యవధిలో జడేజా (9), హెట్మెయర్ (15), బిష్ణోయ్‌ను ఔట్ చేశాడు.
ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు నిలువరించిన కేకేఆర్‌కు ఛేదన అంత తేలిక కాదని ఆరంభంలోనే తెలిసొచ్చింది. 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా పడుతూ లేస్తూ సాగింది. ఖాతా తెరవకుండానే సీఫర్ట్, రహానే పెవిలియన్ చేరగా రఘువంశీ (10), నాలుగు బౌండరీలు, ఓ సిక్స్‌తో దూకుడగా ఆడిన గ్రీన్ (27), రోమన్ పావెల్ (23) కూడా నిరాశపరచడంతో ఆ జట్టు ఒకదశలో 85/6తో ఓటమిదిశగా సాగింది. కానీ రింకూ మాత్రం పట్టు వదల్లేదు. అనుకుల్ రాయ్ (16 బంతుల్లో 29 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతడికి మంచి సహకారం అందించాడు. 4 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 40 పరుగులు అవసరమవగా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో రింకూ గేర్ మార్చాడు. అనుకుల్ సైతం బ్యాట్ ఝుళిపించి 4, 6 బాది ఒత్తిడిని తగ్గించాడు.
రాజస్థాన్: 20 ఓవర్లకు 155/9 (వైభవ్ 46, జైస్వాల్ 39, వరుణ్ 3/14, కార్తీక్ 3/22);
కోల్‌కతా: 19.4 ఓవర్లకు 161/6 (రింకూ 53*, అనుకుల్ 29*, జడేజా 2/8, బర్గర్ 1/20)